గద్వాల: మహిళల న్యూడ్ ఫోటోస్ సర్కూలేట్ చేసే వారిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ హెచ్చరించారు. గద్వాలలో జరిగిన ఆడవారి ఫోటోస్ సర్కులేషన్ విషయంలో జిల్లా ప్రజలు అందరూ విజ్ఞతతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, మహిళల ఫోటోస్‌ను సర్కులేట్ చేసే వారిపై పోలీస్ సోషల్ మీడియా సెల్ ద్వారా నిఘా ఉంచి గమనిస్తున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఇది చాలా సున్నితమైన విషయం అయినందున, ఆడవారి గౌరవం, ఆత్మాభిమానంకు భంగం కలిగించే విధంగా ఉన్నదున ఎవరు కూడా ఆషామాషీగా తీసుకోకుండా, తమాషాగా చూడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా పరిధులు దాటి ప్రవర్తిస్తే చట్టపరంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు.
ఇట్టి ఫోటోలను ఎవరైన ఇతరులకూ పంపిన, సోషల్ మీడియాలో షేర్ చేసిన, డౌన్‌లోడ్ చేసుకున్న వారిపైన కూడా గుర్తించి యాక్షన్ తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎవరైనా మహిళలను ట్రాప్ చేసి వారి ఫోటోలను తీసుకుని రకరకాల ప్రలోభాలకు లోనూ చేసి పైశాచిక ఆనందం పొందే వారిపైన కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే పిడి యాక్ట్ కేసులు పెట్టి శిక్షలు పడే విధంగా చేస్తామని, అట్టివారిపైన రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తామని ఆయన హెచ్చరించారు. బాధిత మహిళలు ఉంటే నిర్భయంగా ముందుకు వచ్చి వారి సమస్యలు తెలియజేయవచ్చునని, తమను నేరుగా గానీ, ఫోన్ ద్వారా గానీ, లెటర్స్, ఈమెయిల్, ట్విట్టర్, ఇన్‌స్ట్రగ్రామ్ వంటి మాధ్యమాలను ఉపయోగించి = సంప్రదించి తెలియజేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.