Sunday, December 22, 2024

రానున్న వేసవికాలంలో బీర్ల కొరత రాకుండా చర్యలు

- Advertisement -
- Advertisement -

Actions to prevent shortage of beers in coming summer

అధిక ఉత్పత్తి కోసం ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు
బేవరేజస్ కార్పొరేషన్‌తో కలిపి ఆబ్కారీ శాఖ కసరత్తు
ముడిసరుకు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్: రానున్న వేసవికాలంలో బీర్ల కొరత రాకుండా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ సంవత్సరం మార్చి నుంచి మే నెల వరకు బీర్ల కొరత ఏర్పడడంతో పక్క రాష్ట్రాల నుంచి బీర్లను తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 4 సంవత్సరాలుగా బీర్ల ఉత్పతికి సంబంధించి వివరాలను ఇప్పటికే తెప్పించుకున్న ఎక్సైజ్ శాఖ దానికి తగ్గట్టుగా ముడిసరుకులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో బేవరేజస్ కార్పొరేషన్‌తో కలిపి ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. రాష్ట్రంలో అధికంగా అమ్ముడయ్యే బీర్లకు సంబంధించిన కంపెనీల్లో కింగ్‌పిషర్‌దే అగ్రస్థానంగా ఉంది. అయితే దీనికి ఈ సంవత్సరం అధిక డిమాండ్ ఏర్పడడంతో పక్కరాష్ట్రాల నుంచి తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.

6నెలలు మాత్రమే దాని కాలపరిమితి
రెండు సంవత్సరాలుగా 2020, 2021 సంవత్సరాల్లో కరోనా ఉధృతి అధికంగా ఉండడంతో బీర్లను తాగడానికి ప్రజలు వెనుకంజ వేశారు. దీంతో ఈసారి ఎక్సైజ్ శాఖ బీర్ల ఉత్పత్తిలో ఆచితూచి వ్యవహారించింది. నేపథ్యంలోనే 2022 మార్చి నుంచి మే వరకు రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పక్క రాష్ట్రాల నుంచి బీర్లను కొనుగోలు చేసి షాపులకు ఎక్సైజ్ శాఖ సరఫరా చేసింది. అయితే గతంలో రెండు సంవత్సరాలు కరోనా నేపథ్యంలో తయారు చేసిన బీర్లను తాగడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో వాటిని పారబోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మాములుగా బీర్లు తయారయిన తేదీ నుంచి 6నెలలు మాత్రమే దాని కాలపరిమితి ఉంటుంది. ఆ తరువాత దానిని పారబోస్తారు. అయితే ఈసారి ఏప్రిల్ నెలలో ఏర్పడిన బీర్ల కొరత నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.

ఈసారి లిక్కర్ కన్నా దాదాపు 4 కోట్ల లీటర్ల బీరు అధికంగా సేల్….
ఈ సంవత్సరం ఎండలు దచ్చికొట్టడంతో మద్యం ప్రియులు అధికంగా బీర్లను తాగేశారు. ముఖ్యంగా రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలో విస్కీ, బ్రాందీల కన్నా బీర్లకు డిమాండ్ బాగా పెరిగింది. మార్చి నుంచి మే 15వ తేదీ వరకు (75 రోజుల్లో) రూ.6,702 కోట్ల విలువైన 10.64 కోట్ల లీటర్ల బీర్లను మద్యం ప్రియులు తాగేశారు. లిక్కర్‌తో పోలిస్తే దాదాపు 4 కోట్ల లీటర్ల బీరు అధికంగా తాగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ మొదలైన రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో బీర్లు అధికంగా అమ్ముడుపోవడం ఇదే తొలిశారని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ బీర్ల అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా (2.38 కోట్ల లీటర్ల విక్రయంతో) తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో (కోటి 15 లక్షల లీటర్ల బీర్ల విక్రయం) వరంగల్ జిల్లాలో జరిగింది. మూడో స్థానంలో నల్గొండ జిల్లాలో కోటి 7 లక్షలు లీటర్లు, కరీంనగర్ జిల్లాలో కోటి 6 లక్షలు లీటర్లు, మెదక్ జిల్లాలో 92.44 లక్షలు, హైదరాబాద్ జిల్లాలో 87.49 లక్షల లీటర్లు, మహబూబ్ నగర్ జిల్లాలో 81.22 లక్షల లీటర్లు, ఖమ్మం జిల్లాలో 40.53 లక్షలు లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి 49,84,285 కేసుల బీర్ల విక్రయం జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

గేటర్ హైదరాబాద్ జిల్లాల వాటా ఎక్కువ….
రాష్ట్రంలో 2018, 19 ఆర్థిక సంవత్సరానికి గాను 498.69 లక్షల కేసుల బీరులు అమ్ముడవ్వగా, 2019, 20 సంవత్సరంలో 492.26 లక్షల కేసులు, 2020, 21 సంవత్సరంలో 273.28 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. 2021-,22 సంవత్సరం ఒక్క ఏప్రిల్ నెలలో బీర్లు 26,12,694 కేసులు, 2022-,23 ఏప్రిల్ నెలలో 43,84,285 బీరు కేసులను మద్యం ప్రియులు తాగేశారు. 2021,22 ఆర్థిక సంవత్సరానికి రికార్డ్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరగ్గా, సుమారుగా రూ.30 వేల 780 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అయితే 2022, 23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.40 నుంచి రూ. 45 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మద్యం అమ్మకాల్లో గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల వాటా ఎక్కువ ఉండగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనే ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరుగుతుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News