Wednesday, January 22, 2025

ఏ క్షణమైనా ‘పిడుగు’

- Advertisement -
- Advertisement -

కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: తుమ్మల

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త వినొచ్చు.. అందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండండి.. అని మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులను పరోక్షంగా సంసిద్ధులను చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బుధవారం పర్యటించిన సందర్భంగా తుమ్మల కార్యకర్తలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశా రు. పోయిన ఎన్నికల్లో జరిగిన విధంగా తప్పులు జరగకుండా చూసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టాను, కార్యకర్తలను అనుకున్న రీతిలో పూర్తిగా కలవలేకపోయానన్నారు. ఈసారి అలా జరగదు.. తాను ఇకపై కార్యకర్తల మధ్యే ఉంటాను. ముఖ్యంగా జిల్లాకే పరిమితమవుతాను.. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగాను.. ఇప్పుడు మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా, అపై పాలేరుపైనే దృష్టి పెడతానని కార్యకర్తలకు స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో తుమ్మల వ్యాఖ్యలు రాజకీయంగా దేనికో సంకేతమన్న వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా పార్టీ ముఖ్య నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో రాష్ట్ర రాజకీయాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేతలందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. కొన్నికొన్ని చోట్ల మార్పులు తప్పవంటూనే.. గెలుపు గుర్రాలకే ఈసారి టికెట్లు ఇస్తామని ఖరాఖండిగా తేల్చిపారేశారు. టికెట్లు దక్కని నాయకులను పార్టీ పక్కనపెట్టదని, వారిని పార్టీలోనూ, ప్రభుత్వంలో వివిధ హోదాల్లో గౌరవించుకుంటుందని నేతలకు తెల్చిచెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో నేతల ముఖాల కంటే కూడా, జరిగిన అభివృద్ధిని చూస్తారని నేతలకు కెటిఆర్ నర్మగర్భంగానే చెప్పారు. నేతలు విభేదాలు పక్కనబెట్టి సఖ్యతతో పనిచేసి జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు మనకే దక్కేలా అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఉద్బోద చేశారు. అదే సందర్భంలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జనంలో ఉండే పొంగులేటి వంటి నాయకులను కలుపుకొనిపోవాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నేలకొండపల్లిలో తుమ్మల చేసిన వ్యాఖ్యలు, పాలేరుపైనే దృష్టి పెడతానని చెప్పడం చూస్తుంటే పాలేరు టికెట్ విషయంలో అధిష్ఠానం నుంచి తుమ్మలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టుగా ఆయన అనుచరవర్గం ఆనందం వ్యక్తం చేస్తున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News