అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే వసూళ్లు 280 కోట్లు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘పుష్ప’ థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. ఈ వేడుకలో సుకుమార్, ‘ఆర్య’ చిత్రం లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదంటూ స్టార్ హీరో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడుతుంటే అక్కడే ఉన్న సుకుమార్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ “సుకుమార్ గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఆయన కూడా నా గురించి ఎక్కువ చెప్పలేరు. ఎందుకంటే మన వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌తో పంచుకోలేం. సుకుమార్ నాకు అంత సన్నిహితమైన వ్యక్తి. సుకుమార్ అంటే ఏంటో ప్రపంచానికి తెలియాలి. సుకుమార్ వల్లే నా లైఫ్ ఒకలా ఉంది. లేకపోతే వేరేలా ఉండేది. ఒకటైతే చెప్పగలను… ఐకాన్‌స్టార్ వరకూ రాగలిగాను అంటే దానికి కారణం సుకుమార్.
డార్లింగ్ నువ్వు లేకపోతే నేను లేను… ఆర్య లేదు ఇంకేమీ లేదు’ (కన్నీళ్లు తుడుచుకుంటూ..) పబ్లిక్‌లో భావోద్వేగానికి గురవకూడదని అనుకుంటాను కానీ, కుదరడం లేదు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌ను చేసి, యావత్ భారతదేశం చూసేలా చేశారంటే నా కెరీర్‌కు సుకుమార్ ఎంత కంట్రిబ్యూషన్ ఇచ్చారో మాటల్లో చెప్పలేను” అని అన్నారు. ఈ సందర్భంగా పుష్ప- 2 తర్వాత పుష్ప: వెబ్ సిరీస్ చేయనున్నట్లు దర్శకుడు సుకుమార్ ప్రకటించారు. పుష్ప చిత్రం కోసం సేకరించిన విషయాలతో సమగ్ర పుస్తకం తీసుకొస్తామని చెప్పారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఆయన తన భార్య, పిల్లలకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబోస్ గురించి మాట్లాడుతూ వేదికపైన ఉన్న ఆయనకు పాదాభివందనం చేశారు.
తన సినిమా కోసం పనిచేసిన కిందిస్థాయి టెక్నీషియన్స్‌కు ఒక్కొక్కరికి రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సుకుమార్ మాట్లాడుతూ “అల్లు అర్జున్ నాకు దేవుడు లాంటి వాడు. ఆయన చాలా గొప్ప నటుడు. మొహంలోనే అన్ని భావాలు పలికించగల గొప్ప నటుడు. అలాంటి నటుడు దొరకడం అదృష్టం. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండించగల సత్తా అల్లు అర్జున్ సొంతం. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. ఇక పుష్ప సినిమా తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అని చెప్పింది రష్మిక మందన్న. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.