Monday, January 20, 2025

వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. హీరోగా, కమెడీయన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 900లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన విలక్షణ నటుడు ఆయన. అన్ని రకాల పాత్రల్లో ఇమిడిపోయిన ఆయన నవరసాలను అద్భుతంగా పలికించారు. కామెడీ ఎంత బాగా పండించగలరో విషాదం అంతేలా పలికించగలిగారు. కలికాలం సినిమాలో ఆయన నటన దానికి మచ్చుతునక.

తన సహజ నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. హీరోగా ఆయన కామెడీ రోల్స్‌తో పాటు సందేశాత్మకమైన పాత్రలలో కనిపించారు. ఇక ఒక వైపు హీరోగా చేస్తూనే అగ్ర నటుల చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను వేస్తూ వచ్చారు. హీరోగా చంద్రమోహన్ 175కి పైగా చిత్రాలలో నటించడం విశేషం. వేయి చిత్రాలను పూర్తి చేయాలన్నది చంద్రమోహన్ కోరిక. కానీ గోపీచంద్ సినిమా ఆక్సిజన్ ఆయన చివరి సినిమా. ఆ తరువాత అనారోగ్య సమస్యలతో ఆయన సినీ ప్రపంచానికి దూరంగా ఉన్నారు.

విలక్షణ నటుడిగా మెప్పించి…
1966లో వచ్చిన ’రంగుల రాట్నం’ చిత్రంతో చంద్రమోహన్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి పలు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. పదహారేళ్ల వయసు, అల్లూరి సీతారామరాజు, సిరిసిరి మువ్వ, జీవన తరంగాలు, ఆత్మీయులు, తల్లిదండ్రులు, పక్కింటి అమ్మాయి, సువర్ణ సుందరి, ఆఖరి పోరాటం, ఆదిత్య 369, 7జి బృందావన్ కాలనీ, ఢీ, కింగ్, లౌక్యం, సంబరాల రాంబాబు తదితర హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. మరో రెండు అడుగులు పొడుగు ఉండి ఉంటే ఖచ్చితంగా అగ్ర హీరోలకే సవాల్ విసిరే వారు మన చంద్రమోహన్ అని విశ్వ నటుడు ఎస్వీ రంగారావు కొనియాడారు అంటే నటుడిగా చంద్రమోహన్ టాలెంట్ ఏమిటో అర్థమవుతుంది. పదహారేళ్ల వయసు, కలికాలం, ఓ భార్య కధ, ఆమె రాధా కళ్యాణం, సుఖ దుఖాలు వంటివి చంద్రమోహన్ నటనకు మచ్చుతునకలు.

హీరోయిన్ల లక్కీ స్టార్…
చంద్రమోహన్ పక్కన నటించిన దాదాపు 60 మంది హీరోయిన్లలో ఎక్కువ మంది ఆతర్వాత స్టార్ హీరోయిన్లుగా మారడం విశేషం. ఆయనతో మొదట నటించిన వాణిశ్రీ, విజయనిర్మల, చంద్రకళ, లక్ష్మి,మంజుల వంటి సీనియర్ హీరోయిన్ల నుంచి రాధిక, విజయశాంతి, జయసుధ, జయప్రద, శ్రీదేవి, విజయశాంతి, భానుప్రియ… ఇలా చాలా మంది హీరోయిన్లు స్టార్లుగా మారి ప్రేక్షకులను అలరించారు. ఎంతో మంది కొత్త హీరోయిన్లు చంద్రమోహన్ తో మొదట నటించి తరువాత తారాపధంలోకి దూసుకుపోయిన వారే.

ఇక చంద్రమోహన్ అభిమాన హీరోయిన్ జయసుధ. వారిద్దరూ కలిసి 34 చిత్రాల్లో జంటగా నటించారు. వాటిల్లో సత్యభామ, ఇంటింటి రామాయణం, గోపాలరావుగారి అమ్మాయి వంటి వినోదాత్మక చిత్రాలతోపాటు కలికాలం, ఆమె, సగటు మనిషి, అమ్మాయి కాపురం వంటి భాగోద్వేగ చిత్రాలు ఉన్నాయి.

స్టార్ హీరోల ప్రశంసలను అందుకొని…
చిన్న సినిమాలకు కొంగుబంగారం చంద్రమోహన్. ఆ రోజులలో చిన్న నిర్మాత నుంచి ఏ కొత్త నిర్మాత అయినా సినిమా తీయాలంటే ఫస్ట్ ఛాయిస్‌గా చంద్రమోహన్ ఉండేవారు. నేడు స్టార్ ప్రొడ్యూసర్‌గా ఉన్న సి.అశ్వనీదత్ తీసిన మొదటి సినిమా ‘ఓ సీత కథ’లో హీరో కూడా చంద్రమోహన్ కావడం విశేషం. అలా హీరోయిన్లకే కాదు కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులకు చంద్రమోహనే తొలి ఆప్షన్. ఆయన ప్రతిభను ఎన్టీఆర్ తొలి రోజుల్లోనే అభినందించారు. అక్కినేని అయితే తన సినిమాలలో వరస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు.

కృష్ణ, కృష్ణంరాజులతో రూంమేట్‌గా ఉండేవారు చంద్రమోహన్. కృష్ణ సొంత సినిమాల్లో చంద్రమోహన్‌కి పాత్ర లేకుండా ఉండదం అతిశయోక్తి కాదు. కృష్ణ రూపొందించిన కురుక్షేత్రం మూవీలో అభిమన్యుడిగా కీలక పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు చంద్రమోహన్. పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాలతోఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న చంద్రమోహన్ ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు దక్కించుకున్నారు.

సినీ ప్రముఖుల సంతాపం…
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని నివాసంలో ఏర్పాటుచేసిన చంద్రమోహన్ భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. బ్రహ్మానందం, రేలంగి నరసింహారావు, ప్రభ, కె.దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ఆయనకు పూలతో నివాళులర్పించారు. ఇక చంద్రమోహన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. చంద్రమోహన్ మృతిపట్ల స్టార్ హీరో బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. “తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, సంపూర్ణ నటుడు చంద్రమోహన్ పరమపదించడం ఎంతో విషాదకరం. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు.

సాంఘిక, పౌరాణిక పాత్రల పోషణలో ఆయన మేటి. చంద్రమోహన్ నాన్న గారితో కలసి యుగపురుషుడు, నిండుదంపతులు, ధనమా? దైవమా? ఇలా ఎన్నో చిత్రాలలో చక్కని పాత్రలు పోషించారు. ఇక నా సినిమా ఆదిత్య 369 చిత్రంలో చంద్రమోహన్ తెనాలి రామకృష్ణ కవిగా పోషించిన పాత్ర మరపురానిది. చంద్రమోహన్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు”అని అన్నారు. చంద్రమోహన్ ఇక లేరని తెలియడం ఎంతో విషాదకకరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. “ప్రాణం ఖరీదు సినిమా సందర్భంగా ఆయనతో ఏర్పడిన తొలి పరిచయం ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది.

‘సిరిసిరిమువ్వ, శంకరాభరణం, రాధాకళ్యాణం, నాకూ పెళ్ళాం కావాలి.. లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు చంద్రమోహన్‌”అని చిరంజీవి తెలిపారు. స్టార్ హీరో వెంకటేష్ మాట్లాడుతూ “చంద్రమోహన్ మృతిచెందారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా”అని చెప్పారు. స్టార్ హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ అకాల మరణం బాధాకరమని అన్నారు.

సోమవారం అంత్యక్రియలు…
చంద్రమోహన్ పెద్ద కుమార్తె అమెరికాలో ఉండటం వలన ఆమె వచ్చేంత వరకు చంద్రమోహన్ పార్థివ శరీరాన్ని ఫిలింనగర్‌లోని ఇంట్లోనే ఉంచుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఫిలిం ఛాంబర్‌లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచడం లేదని వారు చెప్పారు. ఇక సోమవారం చంద్రమోహన్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుపుతామని ప్రముఖ నిర్మాత, చంద్రమోహన్‌కి స్వయానా మేనల్లుడైన శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు. అయితే అంత్యక్రియలు జరిపే స్థలం ఎక్కడ అనేది చంద్రమోహన్ కుమార్తె అమెరికా నుండి వచ్చిన తరువాత నిర్ణయిస్తారని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News