బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన మనోజ్ కుమార్ కన్నుమూశారు. ఎక్కువ దేశభక్తి సినిమాలు తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మనోజ్.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు బాలీవుడు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా తెలియజేస్తున్నారు.
కాగా, మనోజ్ కుమార్.. దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన అపారమైన కృషికి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.కేవలం నటుడు, దర్శకుడు మాత్రమే కాకుండా.. చిత్ర పరిశ్రమలో స్క్రీన్ రైటర్, గేయ రచయిత, ఎడిటర్‌గా ఆయన కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి గాను, కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మశ్రీ, 2015లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.