మన తెలంగాణ/హైదరాబాద్ : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బెంగళూరులోని కోర్టు 11 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆనేకల్ కోర్టులోని నాలుగో అదనపు సివిల్ జడ్జి సల్మా ఎ.ఎస్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు సోమవారం మధ్యాహ్నం హేమను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలిసారి జారీ చేసిన నోటీసులకు అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాని సంగతి తెలిసిందే. రెండోసారి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేయగా ఇప్పుడు ఆమె విచారణకు హాజరుకాక తప్పలేదు. సోమవారం ఆమె పోలీసులకు వద్దకు బుర్ఖా ధరించి విచారణకు వచ్చారు. మీడియా కంట పడకుండా ఆమె పూర్తిగా బుర్ఖా ధరించి కనిపించారు. పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన మరో వ్యాపారిని కూడా సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, పోలీసులు హేమను కోర్టుకు తీసుకెళ్లగా అక్కడ హేమ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేం తప్పు చేయలేదని.. మీడియా తనపై ఇప్పటిదాకా రాసినదంతా అబద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలు, యూరిన్ వంటి శాంపిల్స్ ను కాసేపటి క్రితమే సేకరించారని అన్నారు. “నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడు నన్ను తీసుకొచ్చారు. అసలు నేను హైదరాబాద్ నుంచి ఆ వీడియో పంపాను. నన్ను ఎలా తీసుకెళ్తున్నారో సిసిబి వారికి చెప్పాను. మందు తాగలేదు, బర్త్ డే కేక్ కట్ చేసి హైదరాబాద్ వచ్చాను. నేను మా ఇంటి నుంచి బిర్యానీ వీడియో అప్‌లోడ్ చేశాను” అని హేమ తెలిపారు. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో పోలీసులు ఆమెను పరప్ప అగ్రహార జైలుకు తరలించారు. అంతకుముందు కెసి జనరల్ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.