ముంబయి: డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్‌కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్‌బ్యూరో(ఎన్‌సిబి) అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్‌సిబి బృందం శనివారం సాయంత్రం ముంబయిలోని కోహ్లీ నివాసంలో సోదాలు చేపట్టింది. కోహ్లీ నివాసంలో కొద్ది మోతాదులో కొకైన్ లభించినట్టు అధికారులు తెలిపారు. అనంతరం ఆయణ్ని తమ కార్యాలయంలో కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. ఆదివారం ఉదయం కోహ్లీ అరెస్ట్ గురించి ఎన్‌సిబి వెల్లడించింది. కోహ్లీ సోమవారం వరకు ఎన్‌సిబి కస్టడీలో ఉండనున్నారు. బాలీవుడ్‌ను ఇటీవల డ్రగ్స్ కేసులు వెంటాడుతున్నాయి. శుక్రవారం ఇదే కేసులో టివి నటుడు గౌరవ్‌దీక్షిత్ అరెస్ట్ అనంతరం కోహ్లీ అరెస్ట్ కావడం గమనార్హం. మాదకద్రవ్యాల ప్రధాన సరఫరాదారుగా భావిస్తున్న అజయ్‌రాజ్‌సింగ్‌ను ప్రశ్నించిన సందర్భంగా ఇచ్చిన సమాచారంతో కోహ్లీ నివాసంలో సోదాలు నిర్వహించినట్టు ఎన్‌సిబి పేర్కొన్నది. సింగ్‌ను ఎన్‌డిపిఎస్ చట్టం కింద శనివారమే అరెస్ట్ చేశారు. సింగ్ నుంచి 25 గ్రాముల మెఫెడ్రోన్(ఎండి) జప్తు చేసినట్టు ఓ అధికారి తెలిపారు. 2018లోనూ సింగ్‌ను నార్కోటిక్ విభాగానికి చెందిన ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సింగ్ నుంచి పెద్దమొత్తంలో ఎఫెడ్రిన్ జప్తు చేసినట్టు ఓ అధికారి గుర్తు చేశారు.