హైదరాబాద్: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కరళానృత్యం చేస్తోంది. ప్రతి రోజు వేలాది మంది వైరస్ కారణంగా మరణిస్తున్నారు. అయితే, ఈసారి కరోనా మహమ్మారి ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలను కూడా చంపుతోంది. ఇప్పటికే వైరస్ సోకి సినిమా, రాజకీయ ప్రముఖులు ప్రాణాలు విడిచారు. ప్రతిరోజూ ఏదో ఒక పరిశ్రమకు చెందిన ప్రముఖులు చనిపోతున్నారు. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఇటీవల మరో కళాకారుడిని కోల్పోయింది. ప్రముఖ మలయాళ నటుడు, రచయిత మాడంపు కుంజుకుట్టన్ (81) కోవిడ్ -19తో కన్నుమూశారు. మొదట్లో ఉపాధ్యాయునిగా పనిచేసిన అతను తరువాత సినిమాల్లోకి వచ్చాడు. 1978 లో అశ్వద్దమా చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు.
2000 లో విడుదలైన ‘కరుణమ్’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా జాతీయ అవార్డును అందుకున్నారు. 2001 లో బిజెపి తరపున కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కుంజుకుట్టన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర జ్వరంతో త్రిశూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ పరీక్షలు చేయగా.. అతనికి కరోనా నిర్ధారణ అయింది. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత డెన్నిస్ జోసెఫ్ మరణించిన 24 గంటల్లోనే కుంజుకుట్టన్ మృతి చెందడం మలయాళ చిత్ర పరిశ్రమను షాక్ గురిచేసింది. కుంజుకుట్టన్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు ట్వీట్లు చేశారు.