‘ఉపకార్’, ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’, ‘రోటీ కపడా ఔర్ మకాన్’ వంటి చిత్రాల్లో ‘భారత్’ వంటి పాత్రలు పోషించి ప్రజల విశేష అభిమానాలు అందుకున్న నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ శుక్రవారం తెల్లవారు జామున ముంబయిలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. కొంత కాలంగా అస్వస్థతతో ఉన్న మనోజ్ కుమార్ వయస్సు సంబంధిత సమస్యలతో శుక్రవారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో కన్నుమూశారు. తన తండ్రి పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని, కొన్ని సంవత్సరాలుగా మంచం పట్టారని ఆయన కుమారు కునాల్ ‘పిటిఐ’తో చెప్పారు.
మనోజ్ కుమార్ న్యుమోనియాతో ఇటీవల ఆసుపత్రిలో చేరినట్లు కునాల్ తెలిపారు. మనోజ్ కుమార్ అంత్యక్రియలు శనివారం ముంబయి పవన్ హన్స్ శ్మశానవాటికలో జరుగుతాయి. ఆయన 1960, 1970 దశకాల్లో బాక్సాఫీస్ విజయాలు సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, భార్య శశి ఉన్నారు. మనోజ్ కుమార్ ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. 1992లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన 2015లో ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. మనోజ్ కుమార్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.