చెన్నై: రజనీకాంత్ నటించిన తాజా బ్లాక్‌బస్టర్ జైలర్ చిత్రంలో నటించిన ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు జి మారిముత్తు శుక్రవారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మరనించారు. ఆయనకు 57 సంవత్సరాలు. తన కొత్త చిత్రం కోసం పనిచేస్తుండగా ఆయన తీవ్ర గుండెపోటు రావడంతో మరణించారు.
తాను నటించిన కొత్త చిత్రానికి డబ్బింగ్ చెబుతుండగా ఆయన అస్వస్థతకు లోనై, కళ్లు తిరిగి కిందపడి పోయారు. వెంటనే ఆయను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అజిత్, సిమ్రాన్, జ్యోతిక నటించిన వాలి చిత్రం ద్వారా నటుడిగా 111999లో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన మారిముత్తు అనేక చిత్రాలలో నటించారు. అనేక టివి సీరియల్స్‌లో కూడా ఆయన నటించారు. దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆయన ప్రశాంత్, ఉదయతార జంటగా కన్నుం కన్నుం చిత్రానికి 2008లో కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. శుక్రవారం విడుదలైన రెడ్ శాండల్ వుడ్ చిత్రంలో కూడా ఆయన నటించారు. జైలర్, డాక్టర్, ఎంజిఆర్ మగన్ చిత్రాలు నటుడిగా ఆయన మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయన భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.