హైదరాబాద్: ‘మోడీ’ అనే ఇంటి పేరును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు ఆయన పదవే పోయేలా చేసిందన్నది తెలిసిందే. పరువు నష్టం కేసులో రాహుల్ ను సూరత్ కోర్టు దోషిగా తేలుస్తూ రెండేళ్ల శిక్ష విధించడం, ఆయన్ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ ఇవ్వడం 24 గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా మరో వివాదానికి తెరతీశారు. నాడు రాహుల్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసేలా ఒకే ఫ్రేమ్ లో ఉన్న ముగ్గురి ఫొటోలను ట్వీట్ చేశారు. అందులో లలిత్ మోడీ, నరేంద్ర మోడీ, నీరవ్ మోడీ ఉన్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగానే ప్రకాశ్ రాజ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ‘జనరల్ నాలెడ్జ్:ఇక్కడ కామన్ గా ఉన్నది ఏమిటి? జస్ట్ ఆస్కింగ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా మారింది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అంతకుముందు లోక్ సభ గజిట్ నోటిఫికేషన్ ను ట్విట్టర్ లో ప్రకాశ్ రాజ్ పోస్టు చేశారు. ‘ప్రియమైన పౌరులారా .. ఇలాంటి రాజకీయాలకు సిగ్గుపడాలి. ఇది అసభ్యకరమైన తిరోగమన వైఖరి. మనం మౌనంగా ఉంటే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దేశం కోసం మాట్లాడే సమయం వచ్చింది’ అని ట్వీట్ చేశారు.
General Knowledge:-
What is common here #justasking pic.twitter.com/HlNCjJejwk— Prakash Raj (@prakashraaj) March 25, 2023