ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. కారును పేల్చేస్తామని, సల్మాన్‌ను తుదముట్టిస్తామని ఆగంతకులు సోమవారం బెదరించారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ( ఎప్రిల్ 14న) ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ బంగళా వెలుపల దుండగులు పలుసార్లు కాల్పులు జరిపి ఫరారయ్యారు. సల్మాన్‌ను హత్య చేసి తీరుతామని, ఇది కేవలం సంకేత ఘట్టం అని తరువాత ప్రకటించారు. దీనితో ఈ కృష్ణ జింకల వేట కేసు నిందితుడు అయిన ఈ హీరోకు భద్రతను పెంచారు. సల్మాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి అనేక సార్లు బెదిరింపులు వచ్చాయి.
సల్మాన్ కారును టార్గెట్ చేసుకుంటామని ఈ క్రమంలో ఆయన అంతం తప్పదని ఆగంతకుల నుంచి ఫోన్‌కాల్ రావడంతో భద్రత పెంచారు. వర్లీ పోలీసు స్టేషన్‌లో సంబంధిత విషయంపై కేసు దాఖలు అయింది. బెదిరింపుపై పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సల్మాన్ నివాస ప్రాంతాలలో సిసికెమెరాల పటిష్టత, నిరంతర నిఘా జాగరూకత ఎక్కువ చేశారు. హీరో కారులో వచ్చి పోయే సమయం చూసుకుని బాంబు విసురుతామని బెదిరింపుదార్లు హెచ్చరించడం కలకలం రేపింది.