సీనియర్ నటుడు శరత్ బాబు(71) సోమవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయనను ఇటీవలే బెంగుళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. శరీరంలో ఇన్‌ఫెక్షన్ పెరగడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, ఇతర అవయవాలు పాడై చికిత్స పొందుతూ శరత్‌బాబు తుదిశ్వాస విడిచారని డాక్టర్లు తెలిపారు. 250కు పైగా సినిమాలలో నటించిన శరత్ బాబు హీరోగానే కాకుండా విలన్, సహాయ నటుడిగా కూడా చేశారు. ప్రముఖ నటులు శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస. విజయశంకర దీక్షితులు, సుశీలా దేవి ఆయన తల్లిదండ్రులు.
శరత్ బాబు 1973వ సంవత్సరంలో ‘రామ రాజ్యం’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. స్వాతిముత్యం, సాగర సంగమం, మరో చరిత్ర, అభినందన, సీతాకోక చిలుక, సితార, అన్వేషణ, శ్రీరామదాసు, మగధీర, కోకిల, అపద్భాందవుడు, సంసారం ఒక చదరంగం, క్రిమినల్, అన్నయ్య, గుప్పెడు మనసు, ఇది కథ కాదు తదితర సూపర్ హిట్ సినిమాల్లో శరత్‌బాబు నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ‘వకీల్ సాబ్’ చిత్రంలో కనిపించిన శరత్‌బాబు తాజాగా నరేష్, పవిత్రా లొకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
వ్యక్తిగత జీవితం…
ఇక శరత్‌బాబు నటి రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వివాహమైన కొంతకాలానికే వారిద్దరూ విడిపోయారు. అనంతరం ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతని 1990లో వివాహం చేసుకున్నారు. అయితే 2011 సంవత్సరంలో వాళ్లు విడిపోయారు. ఇక ప్రజలు, అభిమానుల సందర్శనార్థం శరత్ బాబు భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో ఉంచారు. అనంతరం రాత్రికి ఆయన భౌతికకాయాన్ని చెన్పైకి తరలించారు. చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.