ముంబయిల: ప్రముఖ సినీ రచయిత, నటుడు శివ్ సుబ్రహ్మణ్యం సోమవారం కన్నుమూశారు. పరిండ, 1945: ఎ లవ్ స్టోరీ, చమేలీ వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలకు రచయితగా పనిచేసిన శివ్ సుబ్రమణ్యం మరణవార్తను సినీ దర్శకుడు హన్సల్ మెహతా ట్విటర్ వేదికగా వెల్లడించారు. నటుడిగా మీనాక్షి సుందరేశ్వర్, హిచ్కీ, 2 స్టేట్స్, స్టాన్లీ కా డబ్బా, కమీనే తదితర చిత్రాలలో ఆయన కనిపించారు. ఈ దిగ్భ్రాంతికర వార్తతో నిద్రలేవడం బాధాకరమని హన్సల్ మెహతా ట్వీట్ చేశారు. సుబ్రహ్మణ్యం మరణానికి గల కారణం తెలియరాలేదు.
శివ్ సుబ్రహ్మణ్యం మృతికి సినీ ప్రముఖులు మనోజ్ బాజ్‌పేయి, రణ్‌వీర్ షోరీ, సినీ దర్శకుడు సుధీర్ మిశ్రా తదితరులు సంతాపం ప్రకటించారు. సుబ్రహ్మణ్యం మృతిపై పాకిస్తానీ దర్శకురాలు బీనా సర్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితమే ఏకైక కుమారుడిని కోల్పోయిన సుబ్రహ్మణ్యం మరణించడం తీవ్ర విషాదకరమని ఆమె ట్వీట్ చేశారు. సుబ్రహ్మణ్యం, దివ్య దంపతుల ఏకైక కుమారుడు జహాన్ తన 16వ పుట్టినరోజుకు రెండు వారాల ముందు బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించినట్లు ఆమె తెలిపారు.