Saturday, December 21, 2024

‘చిన్నా’ నా డ్రీమ్ ప్రాజెక్టు: హీరో సిద్ధార్థ్

- Advertisement -
- Advertisement -

టాలెంటెడ్ యాక్టర్ సిద్ధార్థ్ సరికొత్త పాత్రలో నటించిన చిత్రం ‘చిన్నా’. ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను ఎటాకి సంస్థ నిర్మించింది. ఏషియ‌న్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుద‌ల‌వుతోంది ఈ చిత్రం.   చిన్నాన్నకి, అతని అన్నయ్య కూతురుకి మ‌ధ్య ఉన్న అంద‌మైన అనుబంధాన్ని తెర‌మీద అత్య‌ద్భుతంగా చూపించిన సినిమా ఇది. ఈ చిత్రానికి ఎస్‌.యు.అరుణ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళంలో `ప‌న్న‌యారుం ప‌ద్మినియుం`, `సేతుప‌తి` సినిమాల‌తో  డైర‌క్ట‌ర్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ” ‘చిన్నా’ సినిమా నా లైఫ్ డ్రీమ్. దీన్ని చేయటానికి నాకు 22 సంవత్సరాలు పట్టింది. ఇదే విషయాన్ని మా గురువుగారు మణిరత్నంగారికి కూడా చెప్పాను. దానికి ఆయన ఎందుకలా చెబుతున్నావని అడిగారు. దానికి నేను ‘నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక రోజు నేనొక సినిమా తీస్తాను. అమ్మతోడు ఇంత కంటే బెటర్ సినిమా నాకు తీయటం రాదనే పరిస్థితి నాకు వస్తుంది. ఆరోజు చిన్నా రూపంలో వచ్చింది’ అందుకనే అలా చెప్పాను అని మణిరత్నంగారితో చెప్పాను. ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయటానికి చాలా కారణాలుంటాయి… పద్ధతులుంటాయి. నేను నా సొంత డబ్బులు పెట్టుకుని సినిమా చేసే నిర్మాతని. ఈ సినిమాను తీయాలంటే రూ.30 సంపాదించాలి. ట్యాక్స్ కట్టాలి. నా ఫ్యామిలీని చూసుకోవాలి. మిగిలిన డబ్బులను సినిమాలో పెట్టాలి. అదే నేను సినిమా తీసే పద్ధతి.  గత గురువారమే విడుదల కావాల్సిన ఈ సినిమా. నా కెరీర్‌లోనే బెస్ట్ సినిమా ఇది. సిద్ధార్థ్ అనే వ్యక్తి ఎందుకు నటిస్తున్నాడు.. ఇంకా యాక్టర్‌గా కొనసాగుతున్నాడని చెప్పటానికి సమాధానమే ఈ సినిమా. దీని తెలుగు రిలీజ్ రోజు చూడు అన్నాను. తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా రెస్పాన్స్ ఇస్తారని కూడా డైరెక్టర్ అరుణ్‌కి నేను ప్రామిస్ చేశాను. నాలుగు నెలల ముందే సినిమాను సెన్సార్ చేశాను.

కర్ణాటకలో ప్రెస్ మీట్ పెడితే నువ్వు తమిళోడివి వెళ్లు అన్నారు. మీ భాషను నేర్చుకుని మీవాడిగా మీ ముందుకొస్తుంటే బయటవాడినని ఆపేస్తున్నారేంటని అర్థం కాలేదు. నేను నవ్వుకుని బయటకు వచ్చేశాను. ఇక తెలుగులో సలార్ సినిమాతో పాటు వస్తానని డేట్ పెట్టాను. నేనూ ప్రభాస్ ఫ్యాన్‌ని. తన సినిమాను ఫస్ట్ షో నేను కూడా చూస్తాను. తర్వాత నా సినిమాను చూసుకుంటాను. రెండు సినిమాలు వస్తే తప్పేంటని ఆలోచించాను. సలార్ మీకు బడ్జెట్ పరంగా పెద్ద సినిమా కావచ్చు. కానీ చిన్నా నా లైఫ్ . వాళ్లు డేట్ మార్చేశారు. ఆరోజున పది సినిమాలు వచ్చాయి. సిద్ధార్థ్ కొత్తవాడేమీ కాదు. టాలెంట్ మీదున్న నమ్మకంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. 28న ముందు రిలీజ్ చేయాలనుకున్నాను. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ నా సినిమాను కొన్నారు. అలాగే కేరళలో గోకులం గోపాలన్ గారు నా సినిమాను కొన్నారు. వారిద్దరూ తమ లైఫ్‌లో ఇలాంటి సినిమా చూడలేదని అన్నారు. అలాగే కర్ణాటకలో కె.జి.యఫ్ ప్రొడ్యూసర్స్ నా సినిమాను కొన్నారు. కానీ తెలుగులో సిద్ధార్థ్ సినిమానా? ఎవరు చూస్తారని అడిగారు. థియేటర్స్ దొరకలేదు. ఆ సమయంలో నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చింది ఏషియన్ సునీల్ గారు. ఈ సందర్భంగా జాన్వీకి థాంక్స్.  మంచి సినిమా తీస్తే ఆడియెన్స్ చూస్తారని నమ్మాను. సినిమాలంటే ఇష్టముంటే థియేటర్‌లో మూవీ చూడండి. సినిమా చూసిన తర్వాత సిద్ధార్థ్ సినిమా ఇక తెలుగులో మేం చూడం అని అనిపించిన తర్వాత ఇక తెలుగులో ఇలాంటి ప్రెస్ మీట్స్ పెట్టను. మణిరత్నంగారు, కమల్ హాసన్ గారు సినిమా చూసి ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. నేను కె.విశ్వనాథ్‌గారి సినిమాలను చూసే మూవీస్ గురించి నేర్చుకున్నాను. అందుకనే చిన్నా సినిమాను ఆయనకు అంకితమిస్తున్నాను’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News