హైదరాబాద్: ‘లైగర్’ సినిమాలో హవాలా డబ్బు, విదేశీ నిధులు పెట్టారన్న ఫిర్యాదుపై ఇప్పటికే ఆ సినీ నిర్మాతలు పూరీ జగన్నాథ్, ఛార్మీలను ఈడి ప్రశ్నించింది. కాగా దర్యాప్తులో భాగంగా ఇప్పుడు తాజాగా ఆ సినిమా హీరో విజయ్ దేవర్‌కొండను కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
విజయ్ దేవరకొండ బుధవారం హైదరాబాద్‌లోని ఈడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిసింది. ఆయనను ఈడి అధికారులు పారితోషికం, చెల్లింపు విధానం, ఇతర నటులకు ఎలా చెల్లించారు తదితర విషయాలను ప్రశ్నించారని తెలిసింది. అయితే ఈడి అధికారులతో విజయ్ దేవరకొండ సహకరించినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) ఉల్లంఘన జరిగిందన్న దానిపై ఈడి దర్యాప్తు జరుపుతోంది. కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడి దర్యాప్తు జరుపుతోంది. తప్పుడు మార్గాల్లో సినిమాల్లో పెట్టుబడులు పెట్టారని, కొందరు రాజకీయ నాయకులు కూడా పెట్టుబడి పెట్టారని బక్క జడ్సన్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా ‘లైగర్’ సినిమాను కొన్నవారికి నష్టం జరిగింది. దానిని నిర్మాతలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. బయ్యర్లకు కొంత మేరకు కాంపెంసేట్ చేస్తానని కూడా పూరీ జగన్నాథ్ వాగ్దానం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అతడు తనకు ప్రాణ హానీ ఉందని పోలీసుల రక్షణ కూడా కోరారు. కాగా నటుడు విజయ్ దేవరకొండకు కూడా పూర్తి స్థాయిలో పారితోషికం అందలేదని వదంతులు వినిపిస్తున్నాయి.