Wednesday, January 22, 2025

దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం

- Advertisement -
- Advertisement -

చెన్నై : ప్రముఖ తమిళ నటుడు ‘దళపతి’ విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. 2026 శాసనసభ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట రాజకీయ పార్టీని స్థాపించినట్లు శుక్రవారం ప్రకటించారు. తమిళ నాడు ప్రజలు మార్పును ‘ఆకాంక్షిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత డిఎంకె ప్రభుత్వం గడువు 2026లో ముగియనున్నది. ఆ ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలలో తాను పోటీ చేయగలనని 49 ఏళ్ల విజయ్ వెల్లడించారు. రాజకీయాలు మరొక వృత్తి కాదని, కానీ ‘పవిత్రమైన ప్రజా సేవ’ అని విజయ్ చెన్నైలో ఒక ప్రకటనలో అభివర్ణించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ‘పరిపాలన యంత్రాంగం క్షీణించింది’ అని, ‘అవినీతిమయం’ అయిందని, సమైక్యతను దెబ్బ తీస్తూ, ‘విభజన రాజకీయాలు’ చోటు చేసుకున్నాయని ఆయన విమర్శించారు. ‘తమిళగ వెట్రి కళగం’ అంటే ‘తమిళ నాడు విజయ పక్షం’ అని అర్థం. విజయ్ నుంచి పార్టీ ప్రకటన వెలువడగానే ఆయన అభిమానులు, మద్దతుదారులు వెంటనే పెద్ద పెట్టున వేడుకలు చేసుకోనారంభించారు. వారు తమ ఆనందోత్సాహాన్ని వ్యక్తం చేయడానికి వీధుల్లోకి చేరుకోవడమే కాక ఆన్‌లైన్ వేదికలను కూడా ఉపయోగించుకోసాగారు. \

చలనచిత్ర రంగం నుంచి రాజకీయ రంగంలోకి నటుల ప్రవేశానికి పేరొందిన తమిళ నాడులో విజయ్ రాజకీయ అరంగేట్రం గురించి కొంత కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. దివంగత సినీ ప్రముఖులు ఎంజి రామచంద్రన్, జె జయలలిత, విజయ్‌కాంత్‌తో సహా పలువురు చిత్ర ప్రముఖులు రాజకీయాలలోకి ప్రవేశించిన విషయం విదితమే. ఇటీవల జరిగిన సర్వసభ్య మండలి (జిసి), కార్యనిర్వాహక మండలి (ఇసి) సమావేశాల్లో నిర్ణయించిన ప్రకారం తమ పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయదని, ఎవరికీ మద్దతు ఇవ్వబోదని విజయ్ తెలియజేశారు. పార్టీకి అధ్యక్షుడుగా విజయ్ వ్యవహరించబోతున్నారు. ‘నిస్వార్థ, పారదర్శక, దూరదృష్టి గల, అవినీతి రహిత, కుల, మత విభేదాలు లేని సమర్థ పాలన యంత్రాంగానికి మార్గం సుగమం చేసే రాజకీయ ఉద్యమం కోసం తమిళులు ఆశ పడుతున్నారని విజయ్ ఉద్ఘాటించారు. ప్రజల ఉద్యమం మాత్రమే రాజకీయ మార్పు తేగలదని, అది తమిళ నాడు హక్కులను కాపాడగలదని ఆయన స్పష్టం చేశారు.

తమిళ నాడు ప్రజలకు మనస్ఫూర్తిగా సాయం చేయాలన్నది తన దీర్ఘ కాల వాంఛ అని, తన తల్లిదండ్రుల తరువాత తనకు పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చినవారు ఆ ప్రజలేనని విజయ్ తెలిపారు. సుప్రసిద్ధ సినీ దర్శకుడు ఎస్‌ఎ చంద్రశేఖర్ కుమారుడు విజయ్. ‘నా సారథ్యంలో రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం ప్రారంభమైంది. పార్టీ నమోదు నిమిత్తం ఎన్నికల కమిషన్ (ఇసి)కి దరఖాస్తు దాఖలు చేయడమైంది’ అని ఆయన తెలియజేశారు. జనవరి 25న చెన్నైలో జరిగిన సర్వసభ్య మండలి, కార్యనిర్వాహక మండలి సమావేశాలలో పార్టీ అధ్యక్షుని, సీనియర్ కార్యనిర్వాహక వర్గ సభ్యులను ఎన్నుకున్నారు. పార్టీ నియమావళిని, బైలాలను కూడా ఆమోదించారు. ‘2026 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం ద్వారా ప్రజలు ఆకాంక్షిస్తున్న రాజకీయ మార్పునకు మార్గాన్ని సుగమం చేయడం మా లక్షం’ అని విజయ్ తెలిపారు. ఇసి గుర్తింపు, లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత ‘తమిళ నాడు ప్రజల కోసం మా ప్రస్థానం’ మొదలవుతుందని ఆయన చెప్పారు. పార్టీ విధానాలు, పతాకం, గుర్తు, ఇతర ప్రణాళికలను తరువాత ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ‘పార్టీ పనులకు అంతరాయం కలగకుండా, ప్రజా సేవ రాజకీయాల్లో పూర్తిగా భాగస్వామిని అయ్యేందుకు నేను ఇప్పటికే అంగీకరించిన చిత్రాన్ని పూర్తి చేయాలని నిశ్చయించాను’ అని విజయ్ తెలిపారు. ‘తమిళ నాడు ప్రజల పట్ల నా కృతజ్ఞతగా దీనిని భావిస్తున్నాను’ అని విజయ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News