Monday, December 23, 2024

ఓటు అమ్ముకోవద్దు: నటుడు విజయ్

- Advertisement -
- Advertisement -

చెన్నై: కొంత మంది డబ్బులు తీసుకుని ఎన్నికల్లో ఓటు వేయడాన్ని కోలీవుడ్ సూపర్‌స్టార్ విజయ్ తప్పుబట్టారు. డబ్బు తీసుకుని ఓటు వేయడం తప్పని, ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. చెన్నై వేదికగా శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.‘ ఆడియో, ప్రీరిలీజ్ ఈవెంట్లలో ఇప్పటివరకు చాలాసార్లు మాట్లాడాను. కానీ మొదటిసారి ఇలా విద్యార్థులతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తు ఓటర్లు మీరే. భవిష్యత్తు నాయకులను ఎన్నుకోవలసిందీ మీరే. ఇప్పుడున్న రోజుల్లో వ్యవస్థ ఎలా మారిందంటే డబ్బులిచ్చిన వాళ్లకే కొంతమంది ఓట్లు వేస్తున్నారు. ఒక వ్యక్తి ఓటు కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తున్నాడంటే అతను ఎంత సంపాదించి ఉంటాడో అర్థం చేసుకోండి. కాబట్టి డబ్బు తీసుకుని ఓటు వేయవద్దని విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులకు చెప్పండి.

ఇదంతా విద్యావ్యవస్థలో భాగంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని సమావేశానికి హాజరయిన విద్యార్థ్థుల హర్షధ్వానాల మధ్య విజయ్ అన్నారు. అంతేకాదు విద్యార్థులు కేవలం పుస్తకాల ద్వారా సంపాదించే విజ్ఞానానికే పరిమితం కాకూడదని, అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి నేతల గురించి కూడా తెలుసుకోవాలని ఆయన అన్నారు. అంతేకాదు, పరీక్షల్లో విజయం సాధించని వారితో కొంత సమయం గడపాలని, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం పెద్ద కష్టమేమీ కాదని వారికి చెప్పాలని ఆయన టాపర్లకు సూచించారు. తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించేందుకు ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం శనివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు.

విద్యార్థులకు సర్టిఫికెట్లు, పురస్కారాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా విజయ్ ఓటర్ల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తమిళనాడు మంత్రి దయానిధి మారన్ కూడా విజయ్ చాలా మంచి మాట చెప్పారన్నారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారా అని విలేఖరులు మంత్రిని ప్రశ్నించగా, రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని మంత్రి అన్నారు. కాగా త్వరలోనే విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News