చెన్నై ః తన రాజకీయ పార్టీ టివికె ఏర్పాటు ప్రకటనపై స్పందన పట్ల హీరో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే ఆయన తమిజగ వెట్రి కజగం (టివికె ) పార్టీ ఏర్పాటు గురించి వెల్లడించారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై ఇంతటి స్పందన దక్కుతుందని తాను కూడా ఊహించలేదని, తన పట్ల ఆదరణ చూపుతోన్న తన ఫ్యాన్స్‌కు ప్రజలకు తాను రుణపడి ఉంటానని విజయ్ ప్రకటించారు. అభిమానులు, సోదరసోదరీమణలు, తల్లులు అందరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు అని సామాజిక మాధ్యమంలో తెలిపారు.
తొలి ప్రకటన పట్లనే ఇంత సూపర్‌హిట్ స్పందన దక్కిందని, ఇంతకంటే ఆనందం ఏముంటుందని వెల్లడించారు. తాను 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ తరఫున పోటీకి దిగుతున్నట్లు, ప్రజా సంక్షేమం , తమిళనాడు విజయం తన లక్షం అని, ప్రజలే భాగస్వాములుగా ఈ ఆకాంక్ష నెరవేర్చుకుంటానని తెలిపారు. టివికె అర్థం తమిళనాడు విజయం పక్షం . ఈ విధంగా డిఎంకె, అన్నాడిఎంకెకు సవాలుగా పోటీగా ఈ పార్టీ ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. తెరవెనుక బిజెపితో ఒప్పందం ఉందనే వాదన కూడా ఉంది.