పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ఈనెల 9న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో శృతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని అందాల తార అంజలి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
అవి నాకు బాగా నచ్చాయి…
దర్శకుడు శ్రీరామ్ వేణు నన్ను సంప్రదించి ‘పింక్ సినిమా రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగినట్లు కొత్తగా ఉంటుంది ఈ చిత్రం’ అని చెప్పారు. సినిమా గురించి ఆయన చెప్పిన కాన్సెప్ట్‌లు నాకు బాగా నచ్చాయి. ఈ సినిమాలో చేసిన మార్పులు ట్రైలర్ చూశాక అందరికీ అర్థమై ఉంటుంది.
చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు…
పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడం మొదట్లో కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉండేది. ఆయన వస్తుంటే సెట్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. నేను సాధారణంగా ఎక్కువగా మాట్లాడుతాను. అలాంటి సమయంలో నా వల్ల మిగతా వారు ఏదైనా ఇబ్బందిపడతారా అని భయపడ్డాను. అయితే పవన్ చాలా ఇన్‌పుట్స్ ఇస్తూ సినిమా చేయించారు. అవన్నీ చూశాక మన క్యారెక్టర్‌ని మనం సరిగ్గా చేస్తే సరిపోతుంది అనే నమ్మకం వచ్చింది.
మంచి స్నేహం ఏర్పడింది…
నాకు, నివేదా, అనన్యకు మధ్య చాలా సీన్స్ ఉంటాయి. మా మధ్య స్నేహం లేకుంటే క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా రావు. మా మధ్య చాలా తక్కువ సమయంలో మంచి స్నేహం ఏర్పడింది. అందువల్ల ఈ సీన్స్‌లో సులభంగా నటించగలిగాము.
మార్పులన్నీ మెయిన్ స్టోరీ చుట్టే…
‘పింక్’ కథలోని సోల్ ‘వకీల్‌సాబ్’లో అలాగే ఉంటుంది. మార్పులన్నీ ఆ మెయిన్ స్టోరీ చుట్టూ చేశారు. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు మనకు నిత్యకృత్యం అయ్యాయి. ఆ వార్తలు మనకు సాధారణమై పోయాయి. మన ఇంట్లో ఇలాంటిది జరిగితే ఎలా స్పందిస్తాం? అనేది సినిమాలో చూపిస్తున్నాం.
ఆయనతో రెండు సీన్స్…
‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రకాష్ రాజ్‌తో మరోసారి పనిచేసే అవకాశం వచ్చింది. రెండు సీన్స్‌లో ఆయనతో కలిసి నటించాను. మన ఎదుట ఉన్న ఆర్టిస్ట్ బాగా నటిస్తేనే మనకూ ఆ టైమింగ్ వస్తుంది. వాళ్లు సరిగా చేయకుంటే మనమూ డల్ అవుతాము. ప్రకాష్ రాజ్‌తో పనిచేసినప్పుడు మనకూ ఆ ఎనర్జీ వస్తుంది.
చేసిన మంచి మార్పు ఇది…
‘మగువా మగువా…’ అనే పాట హిందీలో లేదు. మహిళల మీద ఈ పాట చేయడం సినిమాలో చేసిన మంచి మార్పు. మగువా… పాట విన్నప్పుడు సంతోషం కలుగుతుంది. ‘పింక్’ హిందీ, తమిళ చిత్రాల్లో మగువా లాంటి పాట ఉండదు.
గుర్తుండిపోయే క్యారెక్టర్…
నేను గతంలో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాను. వాటిలో ‘వకీల్ సాబ్’ క్యారెక్టర్ తప్పకుండా ఉంటుందని చెప్పగలను. తెలుగు, తమిళంలో కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో చెబుతాను.
భవిష్యత్‌లోనూ అలాగే…
ఏ నాయికైనా తన కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అనే దానిపై ఆమె కెరీర్ ఆధారపడి ఉంటుంది. నాకు కెరీర్‌లో ఎప్పుడూ గ్యాప్ రాలేదు. నచ్చిన సినిమాలు ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నాను. నేను ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నానో భవిష్యత్‌లోనూ అలాగే వెళ్తాను.
Actress Anjali Interview About Vakeel Saab