మన తెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ సినీ నటి హేమ చర్యలకు దిగింది. నటి కరాటే కల్యాణి , తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీ సులు ఇచ్చారు. గతంలో తన పరువు, ప్రతిష్టను భంగం కలిగించారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు హేమ లీగల్ నోటీసులు పంపారు. ‘లాస్ట్ టైమ్ నేను ఓ ఇష్యూలో ఉన్నా. నాపై బుదర చల్లే ప్రయత్నం చేశారు. దానిపై నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించా. నా పరువుకు నష్టం కలిగింది. ఇందులో భాగంగా నోటీసులు ఇచ్చా. మాటల్లో కాకుండా ఈసారి న్యాయస్థానానికి వెళ్లా.
సినిమా వాళ్లను చాలా తేలిగ్గా తీసిపారేస్తున్నారు. నాలా మరొకరికి జరగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకా కొంతమంది అడ్రస్‌లు తెలి యలేదు. నాపై మీడియాలోనే అసభ్యంగా మాట్లాడారు. మా వ్యక్తిగత జీవితాలపై నోరుంది కదా అని మాట్లాడకూడదు. నిజాలైనా మాట్లాడకూడ దు. అలాంటిది చాలా ఈజీగా అబద్ధాలు చెప్పేశారు. నాపై వ్యక్తిగతంగా అసభ్యంగా మాట్లాడారు. ఆ వీడియోలన్నీ నెట్‌లో కొడితే వస్తున్నా యి. నేను తప్పు చేయకుండా బ్లేమ్ అయ్యా. ఇలాంటి వాటి నుంచి బయట పడేందుకే లీగల్ నోటీసులు ఇస్తున్నా’నని సినీ నటి హేమ వెల్లడించారు.
అయితే, తన పరువుకి నష్టం వాటిల్లే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖయలు చేస్తున్నారంటూ నటి హేమ అప్పట్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నరేష్, కరాటే కళ్యాణిలు కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తనపై అభ్యంతరకరమైన పదజాలంతో దూషించారని నటి హేమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించే ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 2023, మార్చి 21వ తేదీన కూడా పలు యూట్యూబ్ ఛానళ్లపై సైబర్ క్రైం పోలీసులకు హేమ ఫిర్యాదు చేసింది. తన భర్తతో ఉన్న ఫొటోలకు ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో స్పష్టం చేసింది.
సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో పాటు బతికి ఉన్న సెలబ్రిటీలు చనిపోయారని యూ ట్యూబ్ ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడింది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్lసైట్లు ఇష్టమొచ్చినట్లు రాస్తూ.. మానసిక వేదనకు గురి చేస్తున్నారని అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నటి హేమ 2023లో తన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఇందులో భాగంగా భర్త సయ్యద్ జాన్ అహ్మద్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి కేక్ కట్ చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో కోక్ కట్ చేసే సమయంలో భర్త అహ్మద్‌కు హేమ లిప్ లాక్ ఇచ్చారు. ఈ వీడియోను కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో అభ్యంతరకర థంబ్ నెయిల్స్ పెట్టి ప్రచారం చేశారు. దీంతో ఆగ్రహించిన హేమ అలాంటి ఛానెల్స్‌పై అప్పట్లో ఫిర్యాదు చేశారు.