Monday, December 23, 2024

సినీ ‘సత్యభామ’ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

సత్యభామ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేంత సహజంగా నటించి మెప్పించిన జమున తెలుగు వారికి ఎప్పటికీ ఆన్ స్క్రీన్ సత్యభామగా మిగిలి పోతారనడంలో సందేహం లేదు. ‘వినాయకచవితి’ చిత్రంలో మొదటి సారి ఆమె సత్యభామగా కనిపించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్రలో దర్శనమిచ్చారు. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది. అయితే ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించారు. జమున టాలీవుడ్ లెజెండరీ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, జగ్గయ్య తదితరుల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించిన ఆమె కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ రోజుల్లో మహానటి సావిత్రిని మించిన అందగత్తెగా జమునకు ఫాలోయింగ్ ఉండేది అంటే అతిశయోక్తి కాదు.
జమున 1936 సంవత్సరం ఆగష్టు 30న హంపీలో పుట్టారు. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. తండ్రి ఒక వ్యాపారవేత్త. జమున తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నారు. ఇది ఆ కాలంలో చాలా అరుదు. ఆమె తండ్రి బ్రాహ్మణుడు కాగా.. జమున తల్లి వైశ్య కులానికి చెందిన వారు. 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2014 నవంబరు 10న ఆయన గుండెపోటుతో మరణించారు. వారి కుమారుడు వంశీకృష్ణ-, కూతురు స్రవంతి.

జమున బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాభాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో ‘ము’ అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాదివారు యమునను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరును అలానే ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీనటుడు జగ్గయ్యదీ అదే గ్రామం కావడంతో జమున కుటుంబానికి జగ్గయ్యతో మంచి పరిచయం ఉంది. సహజంగా బెరుకు అంటూ లేని జమున స్కూలులో చదివేకాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యారు.

అందాల తారగా ప్రేక్షకుల హృదయాల్లో…

పాఠశాలలో స్టేజ్ నటిగా కెరీర్ ప్రారంభించిన జమున తన తల్లి ప్రోత్సాహంతో గాత్ర సంగీతం, -హార్మోనియం నేర్చుకుంది. డా.గరికిపాటి రాజారావు ఆమె నటించిన ’మా భూమి’ అనే స్టేజ్ షో చూసి 1952లో తన ’పుట్టిల్లు’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ’ఖిల్జీ రాజ్య పతనం’ అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమునను ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళారు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా నటించారు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఎన్టీఆర్,ఏఎన్నార్, జగ్గయ్య, ఎస్వీ రంగారావు తదితర నట దిగ్గజాలతో కలిసి అందాల తార జమున ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆమె నటించిన గుండమ్మ కథ, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, సంతోషం, బంగారు పాప, వద్దంటే డబ్బు, చింతామణి, భూకైలాస్, భాగ్యరేఖ తదితర విజయవంతమైన సినిమాలు తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచాయి. మిస్సమ్మ,- ఇల్లరికం-, ఇలవేల్పు-, లేత మనసులు,- గుండమ్మ కథ చిత్రాలు ఘన విజయం సాధించి రజతోత్సవం జరుపుకున్నాయి. నాటి అందాల తారగా జమున ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

రాజకీయాల్లోకి…

సినీ తారలుగా ఉండి రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో ఆమె అగ్రస్థానంలో ఉంటారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అంటే ఉన్న అభిమానం-, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి అని తన రాజకీయ జీవితం గురించి చెప్పేవారు జమున. 1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేశారు.

మహానటి సావిత్రితో అనుబంధం…

మహానటి సావిత్రితో ఉన్న అనుబంధం గురించి జమున ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మిస్సమ్మ, దొంగ రాముడు, అప్పుచేసి పప్పుకూడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో మేము అక్క చెల్లెలుగా నటించాం. సినిమాల వరకే మా అనుబంధం పరిమితం కాకుండా వ్యక్తిగతంగా కూడా మేమిద్దరం చాలా సన్నిహితులయ్యాం. సావిత్రి నన్ను చెల్లి అని పిలుస్తుండేది. నా పెళ్లికి ఆహ్వానిస్తే ఇంటికి వచ్చి నన్ను అందంగా ముస్తాబు చేసి ఇంట్లో వ్యక్తి మాదిరిగా పెళ్లి పనులన్నీ చేసింది. అయితే కొందరు గిట్టని వాళ్లు మా మధ్య తగవు పెట్టారు. దాంతో మేమిద్దరం ఏడాది కాలం పాటు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలిసిపోయి ఇద్దరం మాట్లాడుకున్నాం. చివరిసారి సావిత్రిని చెన్నైలో చూశాను. ఆ సమయంలో ఆమెను చూసి మనసు చలించి పోయింది”అని జమున పేర్కొన్నారు. 30 ఏళ్ల పాటు సినిమా పరిశ్రమలో సేవలందించిన జమున ఆ తర్వాత కూడా ఎన్నో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చినా కూడా నో చెప్పారు. డబ్బు కోసం పేరును చెడగొట్టుకోలేను అంటూ చిన్న పాత్రలను ఆమెను వదిలేశారు.

సినీ ప్రముఖుల సంతాపం…

జమున పార్థీవ దేహానికి సినీ ప్రముఖులు అల్లు అరవింద్, డి.సురేష్‌బాబు, మురళీ మోహన్, మాదాల రవి, టి.సుబ్బరామిరెడ్డి, ఆది శేషగిరి రావు, జీవిత తదితరులు పూలతో నివాళులర్పించారు. అయితే పలువురు సినీ ప్రముఖులు జమున మృతికి తమ సంతాపాన్ని తెలియజేశారు. చిరంజీవి మాట్లాడుతూ “సీనియర్ హీరోయిన్ జమున స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను”అని అన్నారు.

పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ “ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన జమున తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు”అని చెప్పారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున. నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు.. ఈ రోజున జమున బౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి”అని పేర్కొన్నారు.

మహేష్‌బాబు మాట్లాడుతూ.. జమున మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆమె చేసిన అన్ని ఐకానిక్ పాత్రలు, పరిశ్రమకు ఆమె చేసిన సేవని తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు”అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News