సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత మీర్జాపురం కృష్ణవేణి(101) ఇక లేరు. ఆదివారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 సంవత్సరంలో కృష్ణ జిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్నా, నృత్యం అన్నా అభిమానం. లేత వయసులోనే నాటకాలలో నటించడం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణవేణిని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాతో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు.
ఆ తర్వాత బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు. కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం వివాహానికి దారితీసింది. 1949లో ‘మనదేశం’ అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కృష్ణవేణి నిర్మించారు. కృష్ణవేణికి మేక రాజ్యలక్మి అనురాధ జన్మించారు. అనురాధ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఆదివారం ఉదయమే తమ మాతృమూర్తి తుదిశ్వాస విడిచినట్లు అనురాధ తెలిపారు. కాగా, సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి కి నివాళులు అర్పించాయి. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నాయి.
లక్కీ హ్యాండ్ అన్నారు..
మనదేశం చిత్రాన్ని నిర్మాతగా నిర్మించి కృష్ణవేణి నాయికగా నటించారు. ఈ సినిమాలో యన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ అధికారి పాత్రలో నటించి మెప్పించారు. అందుకుగానూ ఆయనకు రెండు వందల యాభై రూపాయలు పారితోషికం అందించారు కృష్ణవేణి. ఏ ముహూర్తాన కృష్ణవేణి రామారావుకు ఆ మొత్తం అందించారో కానీ తరువాతి రోజుల్లో సూపర్ స్టార్‌గా సౌత్‌లోనే అత్యధిక పారితోషికం పుచ్చుకొనే స్థాయికి చేరారు యన్టీఆర్! అందుకే కృష్ణవేణిది లక్కీ హ్యాండ్ అని అప్ప టి సినీ జనం అంటూ ఉండేవారు. చిత్తూరు నాగ య్య, సిహెచ్. నారాయణ రావు అప్పటికే పేరున్న నటులు.. వారితో కలసి రామారావు వంటి కొత్త నటుడు ఎలా నటిస్తారో అనుకున్నారు..
కానీ, అదరక బెదరక తన పాత్రను తాను ప్రతిభావంతంగా పోషించారు రామారావు. ఆయన ప్రతిభతోనే అగ్ర పథానికి చేరుకున్నారని కృష్ణవేణి చెబుతుండేవారు. ‘మనదేశం’ చిత్రానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. రేలంగి ఇందులో పోలీస్ వెంకటస్వామి పాత్రలో కనిపించారు. ఇందులోని పాటలు అప్పట్లో జనం నోళ్ళలో విశేషంగా చిందులు వేశాయి. తరువాతి రోజుల్లో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన తాతినేని ప్రకాశరావు ఈ సినిమాలో బిట్ రోల్‌లో కనిపించారు. ఇలా పలు విశేషాలతో రూపొందిన ‘మనదేశం’ చిత్రం 1949 నవంబర్ 24న విడుదలయింది. ఈ చిత్రానికి ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ్ రాసిన ‘విప్రదాస్’ ఆధారం. ఆ కథకు ఎల్‌వి ప్రసాద్ స్క్రీన్ ప్లే రాయగా, సముద్రాల సీనియర్ మాటలు, పాటలు పలికించి ఆకట్టుకున్నారు. నటుడిగా, రాజకీయ నేతగా ఎన్టీ ఆర్ అందుకోని ఎత్తులు లేవు. అంత గొప్ప వ్యక్తిని తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి పేరు తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి
రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, విశ్వ విఖ్యా త నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటజీవితానికి తొలుత అవకాశం అందించిన కృష్ణవేణి సంపూర్ణ జీవితం చాలించి శివైక్యం చెందడం బాధాకరమని స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం. మన దేశంలాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి కృషి చేశారు. ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డ్స్ అందుకొన్నారు. ఇటీవల ఎన్‌టిఆర్ వజ్రోత్సవ వేడుకలలో, అంతకుముందు ఎన్‌టిఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా కృష్ణవేణిని ఘనంగా సత్కరించడం జరిగింది. కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని తెలిపారు.
కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలి..
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా గుర్తింపు పొందిన కృష్ణవేణి తుది శ్వాస విడిచారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారు. ఎన్టీఆర్, ఘంటసాల వెంకటేశ్వరరావులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. కృష్ణవేణి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని పేర్కొన్నారు.