డ్రగ్స్ కేసులో 7 గం॥ పాటు ప్రశ్నించిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్‌ప్రీత్ సింగ్‌ను శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దాదాపు 7 గంటల పాటు ఇడి అధికారులు ప్రశ్నించారు. రకుల్ కి చెందిన ఫిట్నెస్ సెంటర్, సెంటర్ బ్యాంక్ ఖాతాలను సేకరించడంతో పాటు లావాదేవాలపై ఆరా తీశారు. రకుల్ ఖాతాల నుంచి పెద్దమొత్తంలో ఎఫ్ క్లబ్ మేనేజర్ కి డబ్బులు బదలయించినట్లు గుర్తించారు. కెల్విన్ కి రకుల్ చాలా సార్లు డబ్బులు పంపినట్లు ఇడిఅధికారులు గుర్తించారు. మరికొన్ని అనుమానిత లావా దేవిల విషయంపై రకుల్ ఆడిటర్ తో పాటు రకుల్ ని కలిపి విచారించారు. కెల్విన్ ఎఫ్ క్లబ్ మేనేజర్ లతో చాటింగ్ వివరాలు సేకరించారు. కాగా సిట్ దర్యాప్తులో రకుల్ పేరు లేనప్పనటికీ ఎఫ్ క్లబ్ నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు కెల్వీన్ ఇచ్చిన సమాచారంతో ఆమెకు ఇడి నోటీసులు జారీ చేసి విచారించింది. తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన డ్రగ్ కేసులో ఇడి అధికారులు ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మిని సుదీర్ఘంగా విచారించిన విషయం విదితమే.
ఈక్రమంలో రకుల్‌ప్రీత్ సింగ్‌ను సైతం మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను ఇడి అధికారులు పరిశీలించారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఇడి అధికారులు ఆరా తీశారు. 2016లో ఎఫ్ క్లబ్లో నిర్వహించిన ఓ పార్టీలో రకుల్ పాల్గొని కెల్విన్ విదేశాలకు డబ్బును తరలించినట్లు ఇడి అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ క్లబ్‌లో డ్రగ్స్ కొనుగోళ్లు జరిగినట్లు కెల్విన్ నుంచి ప్రాథమికంగా సేకరించిన సమాచారం కోణంలోనే దర్యాప్తు కొనసాగింది. ఆ పార్టీకి వచ్చిన రకుల్ మేనేజర్‌ను సైతం ఇడి అధికారులు ప్రశ్నించారు. ఇదిలావుండగా రకుల్ వ్యక్తిగత లావాదేవీలతో పాటు ఢిల్లీ, ముంబయిలో ఉన్న ఖాతాల్లో జరిగిన లావాదేవీలు, యూపీఐ లావాదేవీలపై ప్రశ్నించారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌కు ఎమైనా మెసేజ్‌లు పంపారా అన్న కోణంలోనూ ఇడి అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో తాజాగా డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌ను 10 గంటలు, నటి చార్మిని 8 గంటల పాటు విచారించిన ఇడి రకుల్ ప్రీత్ సింగ్‌ను 7 గంటల పాటు విచారించింది.
రకుల్ రిక్వెస్ట్.. ముందుగా విచారణ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఇడి ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రకుల్‌ప్రీత్ సింగ్ ఈనెల 6వ తేదీన హాజరు కావాల్సి ఉంది. కాగా ముందస్తుగా అగ్రిమెంట్ చేసుకున్న షూటింగ్స్ ఉండటం వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని కాస్త గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్ కోరారు. అందుకు అంగీకరించని అధికారులు మూడు రోజుల ముందుగానే విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రకుల్‌ను శుక్రవారం నాడు ఇడి అధికారులు ప్రశ్నించారు. కాగా ఈనెల 8న రానా ఇడి విచారణకు హాజరుకానున్నారు.