Monday, December 23, 2024

బాలివుడ్ నటి తబస్సుమ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ నటి, టెలివిజన్ సిరీస్ ఆతిధేయురాలు తబస్సుమ్(78) గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె దూర్‌దర్శన్‌లో రెండు దశాబ్దాలపాటు ‘ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్’ అనే టెలివిజన్ సిరీస్‌ను కూడా నిర్వహించారు. ఆమెకు ఛాతీ నొప్పి రావడంతో శుక్రవారం రాత్రి 8.40 గంటలకు ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కుమారుడు హోషాంగ్, మరిది, బిజెపి నాయకుడు అరుణ్ గోవిల్ ఉన్నారు. ఆమె అంత్యక్రియలు శనివారం రాత్రి ముగించేశారు. ఆమె చివరి వరకు ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

తబస్సుమ్ ‘రామాయణం’ టివి సీరియల్‌లో రాముడి పాత్ర పోషించిన టెలివిజన్ నటుడు అరుణ్ గోవిల్ అన్న విజయ్ గోవిల్‌ను వివాహమాడారు. ఆమె 1944లో ముంబైలో జన్మించారు. ఆమె తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు అయోధ్యనాథ్ సచ్‌దేవ్, ఆమె తల్లి రచయిత్రి, పాత్రికేయురాలు అస్ఘరి బేగం. తన మూడేళ్ల వయస్సులోనే తబస్సుమ్ 1947లోనే ‘నర్గీస్’, ‘మేరా సుహార్’, ‘మజ్దార్’ సినిమాల్లో నటించింది. బాల్యం నుంచే ఆమె అనేక సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఆమె నటించిన ప్రధాన సినిమాల్లో బడీ బెహన్(1949), జోగన్(1950), దీదార్, బహార్, అఫ్సానా(1951), బైజూ బావ్రా(1952), మొగల్‌-ఏ-ఆజమ్(1960), ధర్మపుత్ర(1961), ఫిర్ వోహి దిల్ లాయా హూ(1963), గన్వర్, బచ్‌పన్, హీరా రాంఝా, జానీ మేరా నామ్(1970), లడ్కీ పసంద్ హై, అధికార్, తేరే మేరే సప్నే, గ్యాంబ్లర్(1971), మా బెహన్ ఔర్ బీవి(1974), నాచే మయూరి, ఛమేలీ కీ షాదీ(1986), స్వర్గ్(1990)లో నటించారు. ఆమె చిరకాల మిత్రుడు, నిర్మాత ఏ.కృష్ణమూర్తి ఆమె  బాగా చదువుకుందని, వార్తా పత్రికలు, మ్యాగజైన్స్ ఎక్కువ చదువుతుండేదని, చాలా తెలివైనదని, మంచి స్పృహ ఉన్న మనిషని, సామాజిక అంశాల గురించి పట్టించుకునేదని, ఇతరుల బాగోగులు చూసేదని అన్నారు.

టెలివిజన్‌లో ఆమె చెప్పుకోతగ్గ షో ‘ఫూల్ ఖిలే హై, గుల్షన్ గుల్షన్’. 1972 నుంచి రెండు దశాబ్దాలపాటు ఏలిన బాలివుడ్ నటీనటుల జీవితాల గురించి ఆమె అందులో వివరించారు. తబస్సుమ్‌కు ప్రముఖ నటీమణులు సురయ్య, మీనా కుమారి, మధుబాల, నర్గీస్ వంటి వారితో మంచి అనుబంధం ఉండేది. ఆమె 1980 దశకంలో నిర్మాతగా కూడా చలామణి అయ్యారు. బాలివుడ్ దర్శకుడు తబస్సుమ్ మరణంపై సంతాపాన్ని ప్రకటించారు. ప్రముఖ నటి నగ్మా కూడా తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News