Monday, December 23, 2024

‘తొలిప్రేమ’ని దృష్టిలో పెట్టుకునే ‘అన్నీ మంచి శకునములే’ చేశాను: వాసుకి

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో ట్యాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన నటి వాసుకి విలేకరుల సమావేశంలో ‘అన్నీ మంచి శకునములే’ విశేషాలని పంచుకున్నారు.

‘తొలిప్రేమ’ చేశాక దాదాపు 23 ఏళ్ళు తర్వాత ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ చేశారు కదా.. ఈ కథతోనే రావాలని ఎందుకు అనిపించింది ?
తొలిప్రేమ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. నాకు నచ్చిన అవకాశాలు కూడా వచ్చాయి. కానీ చేయడం నాకు కుదరలేదు. ఎందుకంటే నేను మల్టీ టాస్కర్ కాదు. అన్ని పనులు ఒకేసారి చేయలేను. ముందు పిల్లలు, వాళ్ళ చదువులు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారు. పాప మెడిసిన్ (ఫోర్త్ ఇయర్) బాబు సెకండ్ ఇయర్ ఆర్కిటెక్చెర్. ఆనంద్ గారు ఆయన పనిలో బిజీగా వుంటారు. ఇప్పుడు ఏదైనా చేయడానికి నాకు సమయం కుదిరింది. ఇలాంటి సమయంలో నందిని రెడ్డి గారు ఈ కథతో వచ్చారు. నాకు నచ్చింది. సినిమాతో పాటు చదువుపై కూడా ద్రుష్టి పెట్టాను. సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను.

ఇండస్ట్రీ కి దూరం అయ్యారనే ఫీలింగ్ ఉండేదా ?
లేదండీ. ఇరవై మూడేళ్ళుగా సినిమాలు చేయకపోయినప్పటికీ ఆనంద్ గారి వలన ఏదో ఒక సినిమా గురించి ఇంట్లో చర్చ జరుగుతూనే వుంటుంది. అలాగే సినిమా చేసిన్నప్పుడు కూడా నేను ఇండస్ట్రీ దగ్గర ఉన్నాననే ఫీలింగ్ లేదు(నవ్వుతూ)

యాక్టింగ్ కెరీర్ ని ఎందుకు సీరియస్ తీసుకోలేదు ?
యాక్టింగ్ కాదు.. నేను దేన్ని సీరియస్ గా తీసుకొను. ఇదే మన దారి.. ఇదే చేయాలని అనుకోను. అది నా తత్త్వం. కొంచెం ఫిలసాఫికల్ గా వెళ్ళిపోతాను.

ఇంత విరామం తర్వాత ఇందులో పాత్రచేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
ఒక విరామం తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నామంటే మన కంఫర్ట్ జోన్ ముఖ్యం. తొలిప్రేమ చేసినప్పుడు నాకు 18 ఏళ్ళు. అప్పుడు డైలాగ్ రాకపోయినా, తెలుగు రాకపోయినా, కొత్త స్థలమైనా..ఏదైనా ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతాం. ఈ ఏజ్ లో రీఎంట్రీ చేయాలంటే మాత్రం ఒక సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ చూస్తాం. స్వప్న ఎప్పుడూ సినిమా చేయమని అడుగుతుండేది. ఫైనల్ గా నాకు సినిమా చేయానికి వీలు కుదిరింది. కథ విన్న వింటనే సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ ఫీలయ్యాను. ఓకే చెప్పాను.

ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో చాలా క్యూట్ సిస్టర్ పాత్రలో కనిపిస్తా. అన్నీ ఫ్యామిలీస్ లో వున్న సిస్టర్ క్యారెక్టరె. తమ్ముడు ఏం చేసినా సపోర్ట్ చేసే ఒక అక్క వుంటుంది. అలాంటి పాత్రే నాది. నాకు, సంతోష్ పాత్ర కు చాలా మంచి బాండింగ్ వుంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.

ఇందులో ఈ పాత్రకు ఎలాంటి స్కోప్ వుంటుంది ?
ఒక్క సీన్ ఇచ్చినా అందులో మీరు ఏం చేస్తున్నారనేది స్కోప్. ఒక్క షాట్ లో స్క్రోర్ చేసినవారు వుంటారు. మనకి ఇచ్చిన పాత్రకు ఎంత న్యాయం చేస్తున్నామనేది ముఖ్యం.

మీరు చాలా రోజులు తర్వాత సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకులకు ఖచ్చితంగా అంచనాలు వుంటాయి కదా ? తొలిప్రేమ ప్రభావం వుంటుంది కదా ?
అంచనాలు గురించి నాకు తెలీదు. కానీ తొలిప్రేమ అనేది సేఫరేట్ ఏరా(యుగం). అందులో వున్న కొన్ని అంశాలు ఇందులో ఉంటేనే ఈ పాత్రని అంగీకరించివుంటాను. ఆ పేరుని పాడు చేసుకోను కదా. తొలి ప్రేమకు దగ్గరగానే ఈ పాత్ర కనిపించింది. నిజానికి తొలిప్రేమ క్రెడిట్ దర్శకుడు కరుణాకర్ కి దక్కుతుంది. ఆ చిత్రానికి నంది అవార్డ్ వచ్చినపుడు కూడ ఆ క్రెడిట్ ఆయనదే అని చెప్పాను. అప్పుడు ఏం చేశానో నాకు పెద్దగా తెలీదు. కానీ ఇప్పుడు కొంచెం తెలిసింది. ఆ అంచనాలకు కొంచెమైన జస్టిఫీకేషన్ చేయాలనే ‘అన్నీ మంచి శకునములే’ చేశాను.

అప్పుడు సిస్టర్ రోల్.. మళ్ళీ ఇప్పుడు సిస్టర్ రోల్ ఏంటని అనిపించలేదా?
తల్లి పాత్ర ఇవ్వలేదు సంతోషించాలి(నవ్వులు). నిజానకి కథ బావుంటే తల్లి పాత్ర చేయడానికి కూడా రెడీనే. నందిని ఈ కథ చెప్పినపుడు చాలా ఎమోషన్ కి కనెక్ట్ అయ్యాను. అందుకే ఈ పాత్ర చేశాను. నిజానికి నాకు బ్రదర్స్ లేరు. ఆ ఎమోషన్ నాకు పర్శనల్ గా కనెక్ట్ కాదు. కానీ తొలిప్రేమలో కరుణాకరన్ చెప్పిన విధానం చాలా కనెక్టింగ్ గా అనిపించింది. ఇప్పుడు నందిని కూడా చాలా మంచి ఎమోషన్ తో ఈ సినిమాని తీశారు.

ఫీమేల్ డైరెక్టర్ అవ్వడం చాలా ఈజీగా అనిపించిందా ?
ఈ సినిమా సైన్ చేయడానికి ఓ ప్రధాన కారణం ఇది. నందిని పని తీరుకు చాలా ఇంప్రెస్ అయ్యాను.

ఈ సినిమాలో మీకు నచ్చిన పాయింట్ ఏమిటి ?
ఈ మధ్య చాలా వైలెన్స్ సినిమాలు, డిస్టర్బ్ చేసే సినిమాలే వస్తున్నాయి. అంతా బాగానే జరిగింది హ్యాపీ గా వుందనే సినిమాలు తగ్గిపోయాయి. ఒక మంచి ఫెయిరీ టేల్ చదువుతున్నప్పుడు ఎంత ఆనందంగా హాయిగా వుంటుందో.. అన్నీ మంచి శకునములే అలా వుంటుంది.

రాజేంద్రప్రసాద్ గారు, నరేష్ గారు, గౌతమి గారు .. ఇలా సీనియర్ నటులతో పని చేయడం ఎలా అనిపించింది ?
సీనియర్లు అనే ఫీలింగ్ వారికి వుండదు. చాలా కోపరేటివ్ గా వుంటారు. వారు చెప్పినట్లు చేస్తే సీన్ కూడా అద్భుతంగా వస్తుంది. గౌతమి గారు స్వీట్ పర్శన్.

స్వప్న గారితో మీ స్నేహం ఎలా మొదలైయింది ?
ఆనంద్, దత్ గారి కుటుంబానికి చాలా దగ్గర. ఆనంద్ నాన్న గారు దత్ గారి సినిమాలు చేసేవారు, అప్పటి నుంచే వాళ్ళు మంచి స్నేహితులు. ఆనంద్ ,స్వప్నతో పరిచయం చేశారు. మేము ఇరుగుపొరుగు వుండేవాళ్ళం. స్వప్న గారి భర్త ప్రసాద్, ఆనంద్ మంచి ఫ్రండ్స్. అంతా ఫ్యామిలీ ఫ్రండ్స్ లా వుంటాం.

చాలా రోజుల తర్వాత సెట్స్ కి వెళ్ళారు కదా.. షూటింగ్ ఎలా అనిపించింది ? ఎక్కువ టేకులు తీసుకున్నారా ?
నేను ఎక్కువ టేకులు తీసుకోను. నాకు భయం వుండదు. భయం ఉంటేనే ప్రాబ్లమ్.

సంతోష్ శోభన్ పాత్ర ఎలా వుంటుంది ?
సంతోష్ చాలా స్వీట్ పర్సన్. అక్కా అని పిలిస్తాడు. చాలా డౌన్ టూ ఎర్త్. చాలా కేరింగ్. ఇందులో రిషి పాత్ర సంతోష్ వ్యక్తిత్వానికి దగ్గరగా వుంటుంది.

తొలి ప్రేమ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం ఎలా వుంది ?
ఆనంద్, కళ్యాణ్ చాలా మంచి స్నేహితులు. సహజంగానే మా మధ్య మంచి అనుబంధం వుంది. కళ్యాణ్ అప్పటికి, ఇప్పటికి వ్యక్తిగా ఒకేలా వున్నారు.

యాదాద్రి నిర్మాణంలో ఆనంద్ గారి పని తీరుకి చాలా మంచి పేరు వచ్చింది. ఇందులో మీ పాత్ర ఎలా వుండేది?
యాదాద్రి ప్రాజెక్ట్ ఆరంభం నుంచి చివరి దాక నేను ఆయనతోనే వున్నాను. చిన్న కాగితంలో కొండని గీసి చూపించినప్పటి నుంచి సిఎం కేసిఆర్ గారు ఆయనకి సన్మానం చేసిన రోజు వరకూ.. ప్రాజెక్ట్ సంబధించిన ప్రతి డెవలప్ మెంట్ నాకు తెలుసు. ఆయన ప్రతిది చెప్పేవారు. యాదాద్రి ప్రాజెక్ట్ చేయడం మాకు దొరికిన భాగ్యం. గొప్ప ప్రాప్తం. అది చరిత్రలో నిలిచిపోతుంది.

భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు ?
నాకు నప్పే విధంగా వుండాలి, నాకు నచ్చాలి. ఒక మార్క్ క్రియేట్ చేసేలా వుండాలి. అలాంటి పాత్రలే నాకు వస్తాయని భావిస్తున్నాను.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News