చెన్నై: ప్రముఖ నటి వైజయంతిమాలా బాలి ఆరోగ్యం బాగాలేదంటూ తప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలను ఆమె శుక్రవారం ఖండించారు. ‘వైజయంతిమాలా బాలి ఆరోగ్యంగానే ఉన్నారు. ఆమెపై తప్పుడు వార్తలు రాసే ముందు విషయాన్ని ధ్రువీకరించుకోండి. నిరాధార వదంతులు వ్యాపింపజేయకండి’ అని చెన్నైలోని కర్నాటిక్ సంగీతకారుడు గిరిజాశంకర్ సుందరేశన్ తన ఇన్‌స్టాగ్రాంలో శుక్రవారం పేర్కొన్నారు.వైజయంతిమాలా కోడలు నందినీ బాలి సైతం విషయాన్ని షేర్ చేశారు. వైజయంతిమాలా తమిళ సినిమా ‘వాళ్కై’తో సినీరంగంలోకి 1949లో ప్రవేశించింది.
ఆమె తమిళ్, తెలుగు, హిందీ సినిమాల ద్వారా నటిగా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. బిమల్ రాయ్ తీసిన ‘దేవదాస్’(1955) సినిమాలో ఆమె చంద్రముఖి పాత్ర పోషించి విశేషమైన ఖ్యాతిని పొందారు. ప్రముఖ హిందీ నటుడు రాజ్‌కపూర్ ఫ్యామిలీ డాక్టర్ అయిన చమన్‌లాల్ బాలిని వివాహం చేసుకున్నాక ఆమె సినిమా నటనకి గుడ్‌బై చెప్పారు. ఆమె 1968లో పద్మశ్రీ, 2024లో పద్మవిభూషణ్ అందుకున్నారు. తమిళంలో జెమినీ గణేశన్, హిందీలో రాజ్‌కపూర్, తెలుగులో సీనియర్ ఎన్టీఆర్‌తో చేసిన సినిమాలు ఆమెకు మంచి పేరును సంపాదించిపెట్టాయి.