Monday, December 23, 2024

“మీరజాలగలడా నాయానతి!”

- Advertisement -
- Advertisement -

‘ఒక్కసారి వచ్చి పో రఫీ బాబు’… ఇది సరిగ్గా సంక్రాంతి రోజున జమునమ్మ నుంచి ఫోన్ పిలుపు! నాకు వీలు కుదరలేదు! వారం రోజులు నెల్లూరు లో ఉండి రాగానే ఇవాళ ఉదయం ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది! అంతిమ యాత్ర ప్రారంభమయ్యాక అక్కడే జమున గారి జ్ఞాపకాలు అలుముకున్నాయి! జమున గారు మంచి మనసున్న మనిషి! ఆమెతో 22 ఏళ్ళ అనుబంధం నాకు! చల్లని మనసు! మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు నాతో! ఏది దాపరికం ఉండదు! బాగా కలుపుగోలుగా ఉంటారు! నెయ్యి పప్పు కాంబినేషన్‌లో అన్నం తిన్న తరువాతే వాళ్ళింటి నుంచి వెళ్ళాలి! లేదంటే అలుగుతారు! జమున అల్లరి అంతా ఇంతా కాదు! చిలిపి చేష్టలు అన్నీ ఇన్నీ కావు! జమున భర్త రమణా రావు గారు నన్ను బాగా ఇష్టపడే వారు!

ఆయన ఎవ్వరితో మాట్లాడరు… నీతో బాగా మాట్లాడతారు అంటూ నన్ను ఆహ్వానించే వారు జమున గారు అప్పుడప్పుడు! ఆయన మహా మేధావి! జువాలజీ లెక్చరర్ గా రిటైర్డ్ అయినా ఎన్నో ప్రయోగాలు ఇంట్లో చేస్తుండే వారు! అవన్నీ నాకు చూపించడం ఆయనకు ఇష్టం! 2014లో ఆయన చనిపోయాక నా రాక పోకలు తగ్గాయి! బాగా ఫ్రస్ట్రేషన్‌కు వెళ్ళినప్పుడు, మనసు బాలేనప్పుడు ‘ఒక్కసారి వచ్చి పో రఫీ బాబు’ అని జమున గారు ఫోన్ చేసినప్పుడు వెళ్ళేవాడ్ని! ఆమె ఇబ్బందులు, కష్టాలు అన్నీ చెప్పి ‘హమ్మయ్య రిలాక్స్ అయ్యాను’ అని నవ్వేవారు!
జమున కుమార్తె స్రవంతి మంచి గ్లాస్ పెయింటింగ్ ఆర్టిస్ట్! ఆ అమ్మాయి ఆలోచనలు పూర్తి వైవిధ్యం! గ్లాస్ పెయింటింగ్ చాలా హార్డ్! గ్లాస్ కాల్చి దానిపై చేతులు కాల్చుకుంటూ అద్భుతంగా తీర్చి దిద్దేది! ఆ అమ్మాయిని ప్రపంచానికి ఆర్టిస్ట్‌గా నువ్వే పరిచయం చేయాలని జమున గారు పలు మార్లు కోరారు. 2005లో బంజారా హిల్స్‌లో తొలి ప్రదర్శన ఏర్పాట్లు, మీడియా ప్రచారం నేనే చేశాను! ఇప్పుడు స్రవంతి గారు మంచి కళాకారిణిగా గుర్తింపు పొందారు!
పాత సినిమాలు చూడటం నాకు ఇష్టం ఉండేది కాదు! కానీ ఆ తరం సినిమాల విశేషాలు చెబుతూ నాలో ఆనాటి సినిమాలు చూసే ఆసక్తి కలిగించారు జమున గారు! షూటింగ్‌లో తను చేసిన అల్లరిని కథలు కథలుగా చెప్పేవారు! సొంత డబ్బా కాదు కానీ, నేను 2000 సంవత్సరంలో ఆమెను ఇంటర్వ్యూ చేశాను! పెద్దగా నోట్ చేసుకోవడం చూడలేదు ఏమి రాస్తారో ఏమో, పైగా పేరు మహ్మద్ రఫీ, తెలుగు వస్తుందో రాదో అని ఆమె అనుమానం వెలిబుచ్చారు! మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ ప్రచురితమయ్యింది!

ఉదయాన్నే జమున కుమారుడు వంశీ కృష్ణ ఫోన్ చేసి అమ్మ పిలుస్తున్నారు వెంటనే రండి అన్నారు. నేను భయపడుతూ వెళ్లాను… అది బ్రేక్‌ఫాస్ట్ ఆహ్వానం అని వెళ్ళాక తెలిసింది. ఇప్పటికి ఎంతో మంది సినీ జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేశారు కానీ, మీరు అందరిలో భిన్నం, అద్భుతంగా రాశారు! నా మనసులోని భావాలను సరిగ్గా గుర్తు పెట్టుకుని రాశారు అంటూ అభినందించారు. ఆ ఇంటర్వ్యూను ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్నారు ఇప్పటికీ!జమున గారు మంచి అందగత్తె! అభినయం కూడా అద్భుతం! కన్నడి అయినా తెలుగులో పట్టు సాధించారు! సినీ సత్యభామ అనిపించుకున్నారు!

అద్భుత ప్రతిభ ఉంటే పొగరు కూడా వుంటుందిగా అని ఆమె ఒప్పుకునే వారు! ఎన్‌టిఆర్ నే కేర్ చేయలేదు, ఇక మిగిలిన వాళ్ళు ఎంత అనే వారు! తను షూటింగ్‌లో కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం ఎన్‌టిఆర్‌కు నచ్చేది కాదట! అయినా తగ్గేదేలా అని అలాగే కూర్చునే దాన్ని అని జమున గుర్తు చేసుకునే వారు! ఆంధ్ర ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్థాపించి కళాకారులకు పలు సేవలు అందించారు. రాజమండ్రిలో పేద కళాకారులకు ఇళ్ళు కట్టించి ఇచ్చారు!

వరద బాధితుల సహాయార్ధం అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరా గాంధీ అంటే యమ ఇష్టం! కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నుంచి ఎంపిగా ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోయారు! అనేక సాంస్కృతిక సంస్థలను ప్రోత్సహిస్తూ అతిధిగా హాజరయ్యే వారు! పలు వేదికలపై ఇద్దరం అనేక సార్లు అతిధులుగా పాల్గొన్నాం! ఆమె గురించి ఆనాటి జ్ఞాపకాలు వేదికపై చెబుతుండే వాడ్ని! మరుసటి రోజు ఫోన్ చేసి థాంక్స్ అని, ఇంక అనేక విషయాలు పంచుకునే వారు! గత ఏడాది రవీంద్ర భారతిలో జమున గారి సహస్ర పూర్ణ చంద్రోదయం ప్రవీణ్ నిర్వహించినప్పుడు ఆ వేదికపై ఆమె పక్కన నేను కూర్చున్నాను! పాదాలు చూడండి అంటూ జమున గారు చూపించారు! ఆశ్చర్యం అనిపించింది! 86 ఏళ్ళ వయసులో వయసును జయించారు అన్నాను! కాళ్లకు పారాణి పెట్టుకుని కాలి గోళ్ళకు నెయిల్ పొలిష్ పెట్టుకుని ఎంత ముచ్చటగా తయారై వచ్చారో ఆ రోజు జమున గారు!
జమున గారిది నిఖార్సు అయిన మనస్తత్వం! ఎవ్వరినీ లెక్క చేయని తత్వం! అనుకున్న మాటపై నిలబడే మనిషి! అన్యాయాన్ని ఎదిరించడం, ప్రశ్నించడం బుర్రకథ పితామహులు షేక్ నాజర్ దగ్గర నేర్చుకున్నారు. నాజర్ శిష్యురాలిని అని గర్వంగా చెప్పుకునే వారు! నాజర్ శిష్యరికం తన జీవితానికి గొప్ప మలుపు అని ఆమె చాలా సార్లు చెప్పారు! హంపి నుంచి దుగ్గిరాలకు వలస వచ్చాక, అదే ఊర్లో ఉండి నాటకాలు ప్రదర్శించే కొంగర జగ్గయ్య గారికి జమున నడక నచ్చింది! అందం సరే సరి! ఆయన జమున తల్లిదండ్రులను ఒప్పించి ఖిల్జి సామ్రాజ్యం నాటకంలో వేషం కట్టించారు.

ఆ నాటకంలో నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా నటించారు! అలా పుట్టిల్లు సినిమా రంగ ప్రవేశం జరిగింది. 198 సినిమాల్లో నటించి మెప్పించి తెలుగు వారి హృదయాల్లో ముద్ర వేసుకున్నా నేను సినిమాల జోలికి ఈ వ్యాసంలో వెళ్ళదలచుకోలేదు!జమున గారు ఎప్పుడూ జానపద కళాకారుల గురించి ఆలోచించేవారు! వారికి ఎలాగయినా ఆర్ధిక ఊతం ఇవ్వాలని తపించే వారు! దిగ్గజ నేత కొణిజేటి రోశయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పర్యాటక శాఖలో కీలక పదవి ఆశించి అడిగారు కానీ, ఆయన చేయలేకపోయారు! పేద కళాకారులకు సొంతగా గుప్త దానాలు చేశారు!

నేను ఒకసారి అడిగాను… కళలు అంటే ఇష్టం, ఏదయినా అవార్డు ఫంక్షన్ కు రావడానికి డబ్బులు అడుగుతారెందుకు అని? దానికి ఆమె సమాధానం… వున్న వారి దగ్గర తీసుకుని లేని వాడికి పెట్టడం నా నైజం! డబ్బున్న వాళ్ళు లక్షల ఖర్చు పెట్టి చేస్తారు కానీ, ఆ కార్యక్రమానికి సందడి తెచ్చే కళాకారులను చిన్నచూపు చూస్తుంటారు. అందుకే నేను ఇటు తీసుకుని అటు ఇచ్చేస్తాను అన్నారు! సావిత్రి లా దుబారా దానాలు చేయను, కష్టంలో వున్న కళాకారులను ఆదుకునే ప్రయత్నం చేస్తాను అనేవారు!
జమున ఎంతో భయస్థురాలు! లోపల భయపడుతూనే పైకి ఎంతో ధైర్యంగా ఉన్నట్లు నటించే వారు! అందుకే ఆమె జోలికి ఎవ్వరూ రాలేదు! ఆమెను చూసే ధైర్యం చేయలేదు! ఇదే విషయం ఒకసారి మాట్లాడుతూ మహా నటులు ఎన్నో విధాలుగా ప్రయత్నించి అలసిపోయి, విసిగిపోయారని నవ్వుతూ చెప్పారు! సినిమా రంగంలోనే కాదు, నిజ జీవితంలోనూ ఉన్నతంగా జీవించారు! మహిళా శక్తిని చాటి చెప్పారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో లొకేషన్‌లో కోపంగా, గంభీరంగా ఉండటం అలవాటు చేసుకున్నట్లు చెప్పారు! ఆ అలవాటే తనను అందరూ పొగరుబోతు అనిపించేలా చేసిందని,

అలా ఉండటం అలవాటుగా మారిందని జమున గారు తెలిపారు. కళ ప్రజల కోసం అని బలంగా నమ్మేవారు! ఆర్ధిక ఇబ్బందులే తనను నటిని చేసి ఇంత మంది అభిమానులను అందించిందని చెప్పేవారు! ఎప్పుడూ మూలాలను మరచిపోలేదు జమున గారు! రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో సాంస్కృతిక సంస్థలు అన్నీ కలసి వారి ఇంట్లో తులాభారం నిర్వహించడం జమున గారిలో ఎక్కడ లేని ఆనందాన్ని ఇచ్చింది! ఆ ఆనందంలో ‘మీర జారగలడా’ పాటకు నర్తించిన వీడియో వైరల్ అయ్యింది! …. ఇలా ఎన్నో విషయాలు జమున గారి జ్ఞాపకాలు! ఆమెను పద్మశ్రీ రాలేదనే బాధ వెంటాడింది! నేరుగా పద్మవిభూషణ్ ఇస్తారులే అని ఓదార్చే వాడ్ని! స్రవంతి వైవాహిక జీవితం దెబ్బ తినడం,

ప్రేమించి వెంటపడి వివాహం చేసుకున్న రమణా రావు గారు ఆ తరువాత రోజుల్లో మౌనంగా మారిపోవడం, కుమారుడు అంతంత మాత్రమే సెటిల్ కావడం, బంజారా హిల్స్‌లో ఇల్లు మినహా పెద్దగా ఆస్తులు కూడ బెట్టుకోలేకపోవడం, రోశయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తనకు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం, స్థల వివాదం విషయంలో శ్రద్ధ చూపించక పోవడం, సినిమా పరిశ్రమ కూడా పెద్దగా ఆదరించక పోవడం… ఇవన్నీ ఆమెను బాధపెట్టిన అంశాలే! ఏది ఏమయినా జమున గారు తెలుగు చిత్ర సీమలో గుర్తుండి పోయే స్టార్! మూడు వారాలుగా ఇంట్లోనే బెడ్ పైనే ఉన్నారని స్రవంతి తెలిపారు. మంచి ఆత్మీయురాలిని కోల్పోయాను. అశ్రు నివాళి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News