Thursday, December 26, 2024

 సుప్రీంకోర్టుకు అదానీ, జగన్ అమెరికా కేసు వ్యవహారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ, జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ, జగన్ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. గతంలో కూడా హిండెన్‌బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. భారత్‌లో సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదానీ గ్రూపు రూ. 2 ,029 కోట్లు లంచం ఇవ్వజూపిన ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైంది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. రేపు (సోమవారం) తక్షణ విచారణ కోరుతూ పిటిషనర్ విశాల్ తివారీ మెన్షన్ చేయనున్నారు.

భారత దేశంలో రెండో అతి పెద్ద సంపన్నుడైన గౌతమ్ అదానీ భారీ సంక్షోభంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డంపెట్టుకుని రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం 2021-24 మధ్య కాలంలో అప్పటి ఏపి సిఎం జగన్ ప్రభుత్వంతో సహా ఐదు రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రూ. 2,029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ సంచలన ప్రకటన చేసింది. అందులో రూ.1750 కోట్లు అప్పటి ఏపి ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది.

భారత సౌర విద్యత్ సంస్థ రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్‌ను అప్పట్లో అదానీ గ్రూప్ దక్కించుకుంది. దీని ప్రకారం రాష్ట్రాల డిస్కమ్‌లు సెకీతో ఒప్పందం చేసుకుంటే, అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్‌ను సరఫరా చేస్తారు. అయితే అదానీ కోట్ చేసిన ధరను చూసి డిస్కమ్‌లు బెంబేలెత్తాయి. ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు అవి కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేరు… సొమ్ములు సంపాదించలేరు. ఫ్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి.. పెట్టుబడులు సమీకరించడంతో అదానీపై ఒత్తిడి బాగా పెరిగింది. దాంతో అదానీ గ్రూప్ లంచాలు ఇవ్వడానికి ఒడిగట్టిందన్నది ఆరోపణ.

అదానీ, జగన్‌ ముడుపుల వ్యవహారం బయటకు రావడంతో నాడు ఏం జరిగిందన్న దానిపై విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఒప్పంద పత్రాలను పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి సమాచారాన్ని సిఎం చంద్రబాబుకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌ ప్రభుత్వం ఇలాంటి అవినీతి వ్యవహారాలకు పాల్పడి, అస్తవ్యస్త విధానాలను సాగించడం వల్లనే ప్రజలపై విద్యుత్‌ భారం పడిందన్నారు. ఈ వ్యవహారాన్ని క్షుణ్నం గా పరిశీలిస్తున్నామని, ఆ తర్వాత అధికారికంగా స్పందిస్తామని రవికుమార్‌ స్పష్టం చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News