Thursday, January 23, 2025

అదానీ చేతికి ఏసీసీ, అంబుజా సిమెంట్‌

- Advertisement -
- Advertisement -
Adani Holcim
హోల్సిమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అదానీ గ్రూప్‌ 
భారత సిమెంట్‌ రంగంలో ఇదే భారీ డీల్‌ 
దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్‌ కంపెనీగా అవతరణ

న్యూఢిల్లీ: భారత కార్పొరేట్‌ రంగంలో అతిపెద్ద టేకోవర్‌ చోటు చేసుకుంది. భారత్‌లో దిగ్గజ సిమెంట్‌ కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్‌ కంపెనీలు అదానీ గ్రూప్‌లోకి చేరనున్నాయి. ఈ రెండు కంపెనీల ఈక్విటీలో స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్‌ లిమిటెడ్‌కు ఉన్న మెజారిటీ వాటాను అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌తో కలిపి 1,050 కోట్ల డాలర్లకు (సుమారు రూ.81,360 కోట్లు) కొనుగోలు చేసింది. ఈ మేరకు హోల్సిమ్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. భారత సిమెంట్‌ రంగంలోనే కాకుండా భారత కార్పొరేట్‌ రంగంలోనే దీన్ని అతిపెద్ద కొనుగోలుగా భావిస్తున్నారు. హోల్సిమ్‌ కంపెనీకి అంబుజా సిమెంట్‌ ఈక్విటీలో 63.19 శాతం, ఏసీసీ ఈక్విటీలో 54.53 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ వాటా మొత్తం అదానీ గ్రూప్‌ పరం కానుంది.

డీల్‌లో భాగంగా ఒక్కో అంబుజా సిమెంట్‌ ఈక్విటీ షేరును రూ.385, ఏసీసీ షేరును రూ.2,300 చొప్పున అదానీ గ్రూప్‌ కొనుగోలు చేస్తోందని హోల్సిమ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదే ధరకు ఈ రెండు కంపెనీల ఈక్విటీలో మరో 26 శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్‌ త్వరలో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. అదానీ గ్రూప్‌ ఇంత భారీ మొత్తం పెట్టి ఒక కంపెనీని కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. కాగా సిమెంట్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్‌ ఈ మధ్యనే అదానీ సిమెంట్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీని కూడా ఏర్పాటు చేసింది.

అల్ట్రా టెక్, జెపిఎస్ డబ్ల్యూ గ్రూప్‌ కూడా ఏసీసీ, అంబుజా సిమెంట్‌లో హోల్సిమ్‌ వాటా కొనుగోలు చేసేందుకు పోటీపడ్డాయి. అయితే అత్యధిక ధర కోట్‌ చేయడం ద్వారా అదానీ గ్రూప్‌ ఈ రెండు సిమెంట్‌ కంపెనీలను కైవసం చేసుకుంది. ఈ కొనుగోలుతో దేశ సిమెంట్‌ ఉత్పత్తిలో అదానీ గ్రూప్‌ రెండో అతిపెద్ద గ్రూప్‌ కానుంది. ప్రస్తుతం ఏసీసీ, అంబుజా సిమెంట్‌ కంపెనీల వార్షిక సిమెంట్‌ ఉత్పత్తి సామర్ధ్యం 6.6 కోట్ల టన్నులు. అల్ట్రాటెక్ కు  తప్ప మరే కంపెనీకి ఇంత ఉత్పత్తి సామర్ధ్యం లేదు. అదానీల ప్రవేశంతో దేశ సిమెంట్‌ రంగంలో పోటీ మరింత ఉధృతం కానుందదని భావిస్తున్నారు.

ఏసీసీ కంపెనీకి దేశవ్యాప్తంగా 17 సిమెంట్‌ తయారీ యూనిట్లు, సొంత విద్యుత్‌ అవసరాల కోసం తొమ్మిది విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలో 6,643 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి తోడు దేశవ్యాప్తంగా 56,000 మంది డీలర్లు, రిటైలర్లు ఉన్నారు. అంబుజా సిమెంట్‌ 3.1 కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ద్యంతో ఆరు సిమెంట్‌ తయారీ యూనిట్లు, ఎనిమిది సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్లు నడుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News