మన తెలంగాణ/హైదరాబాద్: భారత వ్యా పార దిగ్గజం గౌతం అదానీ నగరంపై కన్నేశారు. హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్ టోల్ ప్రాజెక్టును దక్కించుకునేందుకు సిద్ధమయినట్టుగా సమాచారం. అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, నన్ ఇన్వెస్టర్లు (కెకెఆర్, ఎన్‌ఐఐఎఫ్) సంస్థలు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) టోల్ ఛార్జీల వసూలుతో పా టు నిర్వహణకు సంబంధించి హక్కులను పొందేందుకు రంగంలోకి దిగినట్టుగా తెలిసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు టోల్ హక్కుల కోసం పలు సంస్థలు పోటీలో ఉం డగా అదానీ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ సైతం పోటీ పడుతోంది.
రూ. 7 వేల నుంచి -రూ. 8 వేల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్ డీల్ రేసులో పలు ప్రధాన సంస్థలు ఉన్నట్టుగా తెలిసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ (హెచ్‌జిసిఎల్) 158 కిలోమీటర్ల పొడవైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో 30 సంవత్సరాల పాటు టోల్, ఆపరేట్‌తో పాటు బదిలీ ప్రాతిపదికన నిర్వహించడానికి హెచ్‌ఎండిఏకు సంబంధించిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అంతర్జాతీయ స్థాయి బిడ్లను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌ను ప్రాజెక్టును దక్కించుకోవడానికి దాదాపు 12 సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే బిడ్లకు సంబంధించి ఫ్రీ బిడ్ సమావేశాన్ని హెచ్‌జిసిఎల్ నిర్వహించింది.
జనవరి 24వ తేదీన బిడ్ల పరిశీలన
ఈ బిడ్‌కు సంబంధించి జనవరి నాటికి బిడ్లను సమర్పించే అవకాశం ఉన్నట్లుగా హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. వీటిలో కెనడియన్ పెన్షన్ ఫండ్స్ సిపిపి ఇన్వెస్ట్‌మెంట్స్ (సిపిపిఐబి) అండ్ సిడిపిక్యూ, ఇన్వెస్టర్స్ కెకెఆర్, క్యూబ్ హైవేస్, నేషనల్ ఇన్వెస్టిమెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్), ఎడల్వీస్ బ్యాకెడ్ సుకేరా రోడ్స్ అండ్ ఐఆర్‌బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లతో పాటు స్ట్రాటజిక్ సోర్స్ ప్లేయర్ అదానీ రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ ఉంది. ఈ టోల్ ప్రాజెక్టు బిడ్ సమర్పణకు జనవరి 16, 2023 వరకు చివరి గడువు తేదీగా నిర్ణయించారు. హెచ్‌జిసిఎల్ అధికారులు తెలిపిన ప్రకారం జనవరి 24వ తేదీన బిడ్ల పరిశీలన, జనవరి 28వ తేదీన ప్రాజెక్ట్ కేటాయింపులు ఉంటాయి. ఈ బిడ్లను దక్కించుకున్న కంపెనీ సుమారుగా 30 సంవత్సరాల పాటు ఔటర్ నిర్వహణతో పాటు టోల్ చార్జీలను వసూలు, రహదారుల మరమ్మతులు, బిటీ రోడ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుంది గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్‌రాం గూడ, కొండాపూర్, శంషాబాద్, నార్సింగితో సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్నాయి.
158 కిలోమీటర్ల పొడవు, రూ.6,696 కోట్ల వ్యయం…
ఔటర్‌పై టిఓటి పద్ధతిలో చార్జీలను వసూలు చేస్తున్న తీరును మిగతా రాష్ట్రాల అధికారుల నుంచి ఇప్పటికే ప్రశంసలు సైతం లభించాయి. ఔటర్ రింగ్‌రోడ్డును 158 కిలోమీటర్ల పొడవు, రూ.6,696 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీనికి సర్వీసురోడ్లతో పాటు 19 ఇంటర్‌ఛేంజ్‌లు ఉన్నాయి. మరో 3 ఇంటర్‌ఛేంజ్‌లు (నార్సింగి, కొల్లూరు, బౌరంపేట) వద్ద ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ప్రతిరోజు ఈ రోడ్డుపై సుమారుగా 1.50 లక్షల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ప్రస్తుతం ఈగల్ ఇన్‌ఫ్రా ఇండియా 2019 నుంచి టోల్ చార్జీలను వసూలు చేస్తేంది. ఓఆర్‌ఆర్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2005లో హెచ్‌జిసిఎల్‌ను ఏర్పాటు చేయగా, హైదరాబాద్ అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ 60 శాతం ఈక్విటీ, ఇన్-ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిగిలిన 40 శాతం వాటాను అందిస్తుంది. ప్రస్తుతం, హెచ్‌జిసిఎల్‌లో ఇన్‌క్యాప్ (ఐఎన్‌సిఎపి)కి 26 శాతం, హెచ్‌ఎండిఏ 74 శాతం వాటా కలిగి ఉంది.
ప్రపంచ స్థాయి కుటేరుల్లో మూడో స్థానంలో…
2022లో సంపద వృద్ధిలో భారత దేశంలోనే మొదటిస్థానంలో గౌతం అదానీ నిలిచారు. ప్రపంచ స్థాయి కుటేరుల్లో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆయన ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్ లాంటి వారిని సైతం దాటేసి పలు కీలక ప్రాజెక్టులను సొంతం చేసుకున్నారు. అదానీ ఈ ఏడాది సంపద విలువ 49 బిలియన్ డాలర్ల (రూ.4 లక్షల కోట్లకు పైగా) మేర పెరిగింది. తద్వారా సంపద వృద్ధిలో బిలేట్స్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్‌లను సైతం అదానీ వెనక్కి నెట్టారు. 15.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో అదానీ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.