Monday, December 23, 2024

రాహుల్‌కు తెలియకుండానే జరిగాయా?

- Advertisement -
- Advertisement -

 చిన్న కార్పొరేట్ పదవికీ కాంగ్రెస్‌లో హైకమాండ్ అనుమతి కావాలి
అదానీతో తెలంగాణ ఒప్పందాల విషయం రాహుల్‌గాంధీకి
తెలియదా? కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి.. ఢిల్లీలో మరో నీతి
అవినీతిపరుడని రాహుల్ విమర్శించిన వ్యక్తికే రేవంత్ ఎర్ర తివాచీ
తెలంగాణ డిస్కంలను అదానీకి అప్పగించేందుకు రేవంత్ ప్రయత్నాలు
అదానీతో ఒప్పందాలను రద్దు చేసుకోవాలి రామన్నపేటలో సిమెంట్
పరిశ్రమ వద్దని జనం మొత్తుకున్నా పట్టించుకోని సర్కార్: కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా రెండు నాలుకల ధోరణితో ఉన్నారని మండిపడ్డారు. అదానీ అంశం కారణంగా భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు జగదీశ్‌రెడ్డి, కె.పి.వివేకానంద తదితరులతో కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సిఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అదానీ బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడిందని, అమెరికా నుంచి ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయని పేర్కొన్నారు. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడిందని చెప్పారు. అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్లు తీర్పు చెప్పిందని,గతంలో హిండెన్‌బర్గ్ అనే సంస్థ కూడా అవకతవకలు జరిగినట్లు చెప్పిందని అన్నారు.

ఆదానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా మేము ఆయనను రానివ్వలేదు

తమ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినా తాము ఆయనను రానివ్వలేదని కెటిఆర్ తెలిపారు. అదానీ తమను కలిసి వ్యాపారం చేస్తామని అడిగారని, కానీ తాము ఆయన ప్రతిపాదనలను మర్యాదపూర్వకంగా తిరస్కరించి పంపించేశామని అన్నారు. అదానీతో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని స్పష్టం చేశారు. ఆదానీ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించిందని విమర్శించారు. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్రతివాచీలు పరిచిందని, అదే కాంగ్రెస్‌కు తమకు ఉన్న తేడా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా రేవంత్‌రెడ్డి ఆదానీకి రెడ్‌కార్పెట్ పరిచారా..? అని ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అదానీ సంస్థలతో రూ.12,400 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఘనంగా చెప్పారని, 5000 కోట్లు గ్రీన్ ఎనర్జీ, 5000 కోట్లు డేటా సెంటర్, సిమెంట్ పరిశ్రమ పెట్టుబడులు.. ఇలా మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులు చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ డిస్కంలను అదానీకి అప్పగించేందుకు ఓల్డ్ సిటీ బిల్లుల వసూళ్ల డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు. అదానీకి డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. యాదాద్రిలోని రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పట్టించుకోలేదని, ఏ మూసీ శుద్ధి అంటున్నారో అదే మూసీ సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా మురికి మయం అవుతుందని చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లుగా మమ అనిపించి అదానీకి సహకరించే పని చేశారని విమర్శించారు. పైన బడే భాయ్ ఆదేశించటంతో..కింద చోటా భాయ్ ఆచరించాడని కెటిఆర్ ధ్వజమెత్తారు.

అదానీతో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా..?

తెలంగాణలో అదానీతో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రతి రోజు అదానీని విమర్శించే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలకు మద్దతిస్తున్నారా..? చెప్పాలని డిమాండ్ చేశారు.పారిశ్రామికవేత్తలు ఎవరూ ఊరికే విరాళాలు ఇవ్వరని మహారాష్ట్ర ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీ చెప్పారని, నీకిది, నాకది అని ఏదో పెద్దదే ఆశించి ఇస్తారని అన్నారని పేర్కొన్నారు. విద్యుత్‌కు సంబంధించి ప్రాజెక్టులు ఆదానీకి అప్పగించేందుకు సిఎం ప్రయత్నించారని, దీంతో అదానీ గుండె ఉప్పొంగిపోయి స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చారని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ఇంట్లో నాలుగు గంటల పాటు అదానీ సమావేశమయ్యారని, అదానీ వ్యాపార విస్తరణ తెలంగాణలో ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియదా..? అని అడిగారు. చిన్న కార్పొరేషన్ పదవికి కూడా కాంగ్రెస్‌లో హైకమాండ్ అనుమతి కావాలని, మంత్రి వర్గ విస్తరణకు కూడా ఇప్పటివరకు హైకమాండ్ పర్మిషన్ ఇవ్వలేదని విమర్శించారు. అలాంటప్పుడు అదానీతో ఒప్పందాలకు కాంగ్రెస్ హైకమాండ్ పర్మిషన్ లేదని భావించాలా..? అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.100 కోట్లు అదానీ నుంచి విరాళం తీసుకుందని, రాహుల్ గాంధీకి తెలిసి తీసుకున్నారా..? లేక తెలియకుండా తీసుకున్నారా..? అని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి.. ఢిల్లీలో మరో నీతి

కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, దానికి దేశవ్యాప్తంగా ఒక్కటే విధానం ఉండాలని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కానీ ఢిల్లీలో అదానీ మంచివాడు కాదు.. గల్లీలో మాత్రం అదానీ మంచోడు అని కాంగ్రెస్ పార్టీ అంటోందని, కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి.. ఢిల్లీలో మరో నీతి..? అని దుయ్యబట్టారు. బిజెపిది డబుల్ ఇంజిన్ అంటున్నారని, మరి కాంగ్రెస్‌ది డబుల్ స్టాండర్డ్ కాదా..? అని ప్రశ్నించారు.ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను కెన్యా ప్రభుత్వం రద్దు చేసిందని, తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం లేదని అన్నారు. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. స్కిల్ యూనివర్సిటీకి విరాళం సరియైనదేనని రాహుల్ గాంధీ భావిస్తున్నారా..? అని అడిగారు.

అదానీ అవినీతి పరుడని రాహుల్ గాంధీ అంటుంటారని, అలాంటి వ్యక్తితో వ్యాపారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదంతా రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతుందని భావిస్తున్నామన్నారు. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి ఇవ్వాలని అన్నారు. రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్,బిజెపి ఎందుకు నోరు విప్పడం లేదని అడిగారు. దేశం ప్రతిష్ట మంటగలిసిపోతే బిజెపి ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బిఆర్‌ఎస్ మాత్రమే నిజమైన పోరాటం చేస్తోందని స్పష్టం చేవారు. అదానీ వ్యవహారంపై ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం

ఫిరాయింపు ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కెటిఆర్ వెల్లడించారు. అనర్హత పిటిషన్ల విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ తీర్పుపై ఆయన స్పందించారు. మొన్నటి వరకు స్పీకర్‌ను అనర్హతపై ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారని గుర్తు చేశారు. రీజనబుల్ పీరియడ్‌లో నిర్ణయం తీసుకోవాలని సిజె స్పష్టం చేశారని, రీజనబుల్ పీరియడ్ అంటే మూడు నెలలు అని మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News