Wednesday, September 18, 2024

బొగ్గుగనులపై అదానీ ఆధిపత్యం!

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో బొగ్గుకి ప్రత్యేక స్థానం ఉంది. దేశ పారిశ్రామిక ఉత్పత్తికి అవసరమైన కరెంట్ ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గే ఆధారంగా ఉంది. అంతటి ప్రాధాన్యత గల బొగ్గు ఉత్పత్తి ప్రభుత్వ సంస్థల నుంచి ప్రైవేట్ సంస్థల చేతుల్లోకిపోతున్నది. ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉన్న బొగ్గు గనులన్నీ ప్రైవేట్ సంస్థల పరమవుతున్నాయి. ఫలితంగా బొగ్గు కొరత ఏర్పడి అధికరేటుకి ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యుత్ సంస్థలు బొగ్గును ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ దేశంలోనూ, విదేశాల్లో పాలక ప్రభుత్వాల అండతో బొగ్గు గనులను సొంతం చేసుకుంది.

ఎన్‌డిఎ ప్రభుత్వం వేసిన బొగ్గు గనుల వేలంలో అదానీ గ్రూపే మోడీ అండతో ఎక్కువ గనులను పొందింది. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రత్యేక నిబంధన సరికాదని, పారదర్శకత లోపించిందని ప్రధాని మోడీ కార్యాలయం నిర్ధారించిన తర్వాత కూడా ఆయన ప్రభు త్వం ప్రైవేట్ సంస్థలకు మినహాయింపులు ఇచ్చింది. మోడీకి అత్యంత ఆత్మీయుడైన అదానీ కోసమే ఈ మినహాయింపు కాబట్టి, అదానీ గ్రూపుకి దట్టమైన అటవీ ప్రాంతా ల్లో కూడా 450 మిలియన్ టన్నుల కన్నా ఎక్కువ బొగ్గు కలిగి ఉన్న ప్రాంతంలో కూడా తవ్వకానికి అనుమతించింది. ఇలాంటి అనుమతుల వలన అటవీ ప్రాంతాలకు, గిరిజనులకు తీవ్రనష్ట జరుగుతుంది.

అదానీ ఎంటర్ ప్రైజెస్ గ్రూపు బొగ్గు గనుల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో అటవీ గ్రామాల గిరిజనులే కాకుండా అటవీ పక్క గ్రామాల ప్రజలు కూడా ఆందోళన చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో థీరౌలీ బొగ్గు గని అతి పెద్దది. దీని విస్తీర్ణం 2,672 తో అడవులు, పొలాలు, గ్రామాలతో విస్తరించి ఉంది. 558 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ బ్లాక్ అదానీ గ్రూపు అనుబంధ సంస్థ స్ట్రాటాటెక్ మినరల్ రీసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలో ఉంది. ఈ బ్లాక్ నుంచి సంవత్సరానికి 6.5 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు, అందులో 90% వరకు అదానీ బొగ్గు విద్యుత్ కేంద్రానికి ఇవ్వడానికి పర్యావరణ ఆమోదంతో భారత ప్రభుత్వం అదానీ కంపెనీకి అందించింది.

ఈ గని లో బొగ్గు తవ్వకం వల్ల గిరిజనుల భూములు, అడవి, పొలాలు నాశనం చేయబడతాయి.ఇప్పటికే బొగ్గు రవాణా వలన ఆ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. థీరౌలీ బ్లాక్ నుంచి బొగ్గు తీసేందుకు భారీగా అటవీ ప్రాంతాన్ని నిర్మూలించేందుకు అదానీ సంస్థ సిద్ధంగా ఉన్న సమయంలో అందుకు పర్యావరణ అనుమతి లభించటం గమనార్హం. అదానీ కంపెనీకి వ్యతిరేకంగా అటవీ, భూములను కాపాడుకునేందుకు ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
చత్తీస్‌గఢ్‌లోని హరిహర్ పుర్ గ్రామం రెండు భిన్న ప్రపంచాల మధ్య ఉన్నట్లు ఉంటుంది.

తూర్పు వైపున దశాబ్దాల నాటి పార్సా ఈస్ట్ కాంటా బేసిన్ (పిఇకెబి) ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఉంది.కంటిచూపు మేర కన్పించే ఈ గని అదానీ గ్రూపు చేతికి దక్కింది. మరోవైపున ‘హన్‌దేవ్’ అటవీ ప్రాంతంలో బిలియన్ టన్నుల బొగ్గు ఇంకా భూమిలో మిగిలే ఉంది. మధ్య భారతంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ‘హన్‌దేవ్’ కూడా ఒకటి. దాని విస్తీర్ణం లక్షా 70 వేల హెక్టార్లగా ఉంది. ఈ ప్రాంతం చత్తీస్‌గఢ్‌కి గుండెకాయగా పేర్కొంటారు. ఇక్కడ తలపెట్టిన కొత్త బొగ్గు గని ఏర్పాటును గత పది ఏళ్లగా గిరిజనులు, అటవీ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొత్త గని గిరిజనుల పైనా, అడవి పైనా చెడు ప్రభావం చూపుతుందని అటవీ పరిశోధన సంస్థ హెచ్చరిక చేసినా 2022 చత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఈ గనిలో బొగ్గు బయటకు తీయటానికి అదానీ గ్రూపుకి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.

ప్రతి వారం వందలాది మంది గిరిజనులు దీక్షా శిబిరానికి వచ్చి అదానీ గో బ్యాక్ అంటున్నారు. ఈ కొత్త బొగ్గు గని విస్తరణ కోసం అడవులను నాశనాన్ని ఎదుర్కోవటానికి ‘హన్ దేవ్’ అరణ్య బచావో సంఘర్షణ సమితి ప్రజలను సమీకరిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామసభలు జరుపుతున్నట్లు చెబుతూ మరొక వైపు గిరిజన ప్రజలు రాకుండా పోలీసులచే బారికేడ్లు నిర్మించి పహారాపెట్టారు. అయినా ప్రజలు పర్సా గని విస్తరణకు వ్యతిరేక నినాదాలు చేశారు. గ్రామసభల దొంగ ఆమోద పత్రాలను బట్టబయలు చేశారు. గని విస్తరణకు వ్యతిరేకంగా చలో రాజధానికి అంటూ 300 కి.మీ. పాదయాత్రను ప్రజలు కొనసాగిస్తున్నారు.

బిజహాన్ బొగ్గు గని: ఇది ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా ప్రాంతంలో ఉంది. ఈ బొగ్గు గని కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్చి 2022లో నిర్వహించిన బిడ్‌లో అదానీ గ్రూపు అనుబంధ సంస్థ మహానది మైన్స్ మినరల్ ప్రైవేట్ సంస్థ దక్కించుకుంది. ఈ గని బ్లాక్ కింద 604.64 హెక్టార్లలో బొగ్గు తవ్వకం జరుగుతున్నది. ఈ గని తవ్వకం వల్ల సుందర్ ఘర్ జిల్లాలోని బిజహాన్, జార్పాలం, గిరిసీమి, భోగ్రాకచర్ గ్రామాలు ప్రభావితమై 450 కుటుంబాలు నిర్వాసితులు అవుతారు. గని వల్ల ప్రభావిత గ్రామస్థులు మైనింగ్ ప్రాజెక్టు కొనసాగించడానికి ముందు గ్రామ సభ ఆమోదం పొందాలని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన పునరావాసం, భూములకు న్యాయపరమైన కొత్త భూ పరిహారం, ఆర్‌అండ్ ఆర్ ప్రయోజనాలను పెంచాలని ప్రభావిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వీటిని నెరవేర్చే దాకా పనులు చేపట్టరాదని భోగ్రాకచర్ గ్రామంలో డ్రోన్ సర్వే చేపట్టకుండా అదానీ కంపెనీ అధికారులను ప్రజలు అడ్డుకున్నారు.

మహా జన్‌కో తో ఒప్పందం: భారత దేశంలోని గారే పాల్మా సెక్టార్ 2 బొగ్గు గని కోసం మహారాష్ట్ర పవర్ జనరేషన్ కంపెనీ (MAHA GENCO) తో అదానీ ఎంటర్ ప్రైజెస్ కొత్త బొగ్గు గనుల ఒప్పందం చేసుకుంది. గారే పాల్మా సెక్టార్ 2 బొగ్గు గనిని భారత బొగ్గు మంత్రిత్వ శాఖ 2015లో మహారాష్ట్ర జెన్‌కో కి కేటాయించింది. 2016లో ఈ బొగ్గు గని కోసం గని డెవలపర్ కోసం బొగ్గు శాఖ టెండర్ ప్రకటించింది. రివర్స్ టెండర్ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్ గనిని దక్కించుకుంది. దీని కాంట్రాక్ట్ 34 సంవత్సరాలు. ఈ గని నుంచి సంవత్సరానికి 23.6 మిలియన్ మెట్రిక్ టన్నుల గరిష్ఠంగా బొగ్గును తీసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ గని అదానీ గ్రూపుపరం కావటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ సహకరించాయి. ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వ రంగ బొగ్గు గనులను అదానీ గ్రూపు స్వాధీనం చేసుకుంటున్నది.

అదానీ గ్రూపు మోసాలు: బొగ్గు గనుల లీజుల్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ బొగ్గు విక్రయాల్లో కూడా అక్రమాలకు పాల్పడింది. నాణ్యతలేని బొగ్గు కారుచౌకగా కొనుగోళ్ల చేసి దాన్ని హైగ్రేడ్ బొగ్గుగా నమ్మించి ఎక్కువ ధరకు విక్రయించింది. 2014లో ఇండోనేసియా నుంచి 69,925 టన్నుల నాణ్యత లేని బొగ్గును అదానీ కంపెనీ కొనుగోలు చేసింది. దీని ధర చాలా తక్కువ. ఈ బొగ్గును హైగ్రేడ్ క్వాలిటీ బొగ్గుగా ధ్రువీకరించి తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న టిఎఎన్ జిసిఒ విద్యుత్ సంస్థకు మూడు రెట్లు అధిక ధరకు పెంచి అమ్మింది. ఇలా ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థల నుంచి దాదాపు రూ. 3 వేల కోట్లు దోచుకున్నది. దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అంతర్జాతీయ పత్రిక టైమ్స్ కథనాల్లో వెల్లడించింది. అదానీ బొగ్గు అక్రమాలు ప్రజలపై ఆర్థిక భారం మోపటమే కాకుండా వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడుతున్నాయని పర్యావరణ నిపుణులు మండిపడుతున్నారు.

అదానీ గ్రూపు బొగ్గు అక్రమాలు ఎనిమిది సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైనాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటల్ జెన్సీ (డిఆర్‌ఐ) అదానీ సంస్థల అక్రమాలను గుర్తించింది. ఇండోనేసియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటూ దేశంలో బొగ్గు కృత్రిమ కొరతను సృష్టిస్తూ, దాన్ని విదేశాలకు డబ్బులు తరలించే మార్గంగా ఎంచుకున్నారని 2016లో అదానీతో సహా 40 మందికి డిఅర్‌ఐ నోటీసులు ఇచ్చింది. పోర్టుల్లో దిగుమతైన బొగ్గుకు చూపించిన ధరల్లో 50 శాతం తక్కువ ధరకి కొనుగోలు చేస్తున్నారని, బొగ్గుతో తయారైన విద్యుత్‌ను అధిక ధరలకు అమ్ముకొంటున్నారని ఆరోపించింది. డిఆర్‌ఐ దర్యాప్తును ఆపి వేయాలని బాంబే హైకోర్టు నుంచి అదానీ గ్రూపు స్టే తెచ్చుకుంది.

భారతదేశంలోని అనేక బొగ్గు గనులతో పాటు ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో ‘కార్త్మెకేల్’ బొగ్గు గని, ఇండోనేసియాలో రెండు బొగ్గు గనుల్లో 74% వాటా అదానీ ఎంటర్‌ప్రైజెస్ కలిగి ఉంది. అదానీకి చెందిన ఇండోనేసియా గనుల నుంచే భారతదేశం ఎక్కువగా బొగ్గును దిగుమతి చేసుకుంటున్నది. అదానీ బహుళజాతి ఎంటర్‌ప్రైజెస్ సంస్థ బొగ్గు గనుల కోసం అనుసరిస్తున్న అక్రమ మార్గాలను, మోసాలను, అది సృష్టిస్తున్న అడవుల, పర్యావరణ వినాశనాన్ని, గిరిజనుల జీవితాలను కల్లోలభరితం చేయటాన్ని, అదానీకి మోడీ ఇస్తున్న సహకారం విరమించాలని దేశ ప్రజలు ఉద్యమించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
98859 83526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News