Friday, December 20, 2024

మోడీ ఎక్కడికెళ్లినా అక్కడ అదానీకి కాంట్రాక్టులు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ ఎక్కడికి వెళ్లినా అక్కడ అదానీకి కాంట్రాక్టులు లభించాయన్నారు. ఆ కాంట్రాక్టులు విదేశాలకు చెందినవైనా ఆయనకు లభించాయన్నారు. కేంద్రం కేవలం ఒకే కార్పొరేట్ సంస్థ…అదానీ గ్రూప్‌కు మేలుచేస్తోందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తన ప్రసంగంలో ఆయన మోడీని లక్షం చేసుకుని రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘ఇదివరలో అదానీ విమానాన్ని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు మోడీ ఆయన విమానాల్లో వెళుతున్నారు. మొదట్లో ఈ వ్యవహారం గుజరాత్, స్వదేశం వరకే పరిమితమై ఉండేది, కానీ నేడు అంతర్జాతీయంగా ఈ ఇద్దరు కుమ్మకయ్యారు’ అని పేర్కొన్నారు.

‘ప్రధాని ఆస్ట్రేలియాకు వెళ్లారు, అప్పుడు అదానీకి ఎస్‌బిఐ 1 బిలియన్ డాలర్ల లోన్ ఇచ్చింది. తర్వాత ప్రధాని బంగ్లాదేశ్ వెళ్లారు. అక్కడ బంగ్లాదేశ్ విద్యుత్ అభివృద్ధి బోర్డ్ అదానీ కంపెనీతో 25 ఏళ్ల కాంట్రాక్ట్ చేసుకుంది’అని వివరించారు.
అసలు అదానీ బిజెపికి 20 ఏళ్లలో ఎంత డబ్బు ఇచ్చారు?’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘తనపై ప్రధాని మోడీ ఒత్తిడి తెచ్చి, అదానీకి వాయు విద్యుత్ ప్రాజెక్టును ఇచ్చేలా చేశారని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్ష అన్నట్లు శ్రీలంక ఎలెక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ 2020లో శ్రీలంక పార్లమెంటరీ కమిటీకి తెలిపారు’ అని రాహుల్ తెలిపారు. ‘ఇది భారత విదేశాంగ విధానం కాదు. ఈ విధానం అదానీ వ్యాపారం కోసం రూపొందింది’ అని విమర్శించారు.

తాను భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి ‘2014 నుంచి 2022 లోగా అదానీ సొత్తు 8 బిలియన్ అమెరికా డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్ల మేరకు ఎలా పెరిగాయి?’ అని ప్రశ్నించాడని రాహుల్ తెలిపాడు. ‘భారత్ జోడో యాత్రలో మేము ప్రజల గళం విన్నాము. మేము పిల్లలు, పెద్దలు, మహిళలు..అందరూ చెప్పింది విన్నాము. మేము యువతను ఉపాధి గురించి అడిగినప్పుడు..వారు నిరుద్యోగులుగా ఉన్నామని లేక ఉబేర్ డ్రైవర్‌గా పనిచేసుకుంటున్నామని తెలిపారు. ఇక రైతులైతే పిఎంబీమా యోజన కింద డబ్బు పొందడంలేదన్నారు. వారి భూములు గుంజేసుకుంటున్నట్లు తెలిపారు. కాగా గిరిజనులు ట్రయిబల్ బిల్ గురించి చర్చించారు’ అని చెప్పుకొచ్చారు. మా భారత్ జోడో యాత్ర 500 నుంచి 600 కిమీ. దాటాక చాలా మార్పు కనిపించింది. మేము సమస్యలపై ప్రజలకు చెప్పాలనుకోగా, వారే యాత్ర సందర్భంగా తమ సమస్యల గురించి మాకు వివరించారు’ అని లోక్‌సభలో రాహుల్ వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News