శ్రీలంకలో హరిత ఇంధన శక్తి ప్రాజెక్టుల నుంచి అదానీ గ్రూప్ తప్పుకోవడంపై తమ ప్రభుత్వం ఏమీ విచారించడం లేదని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె సోమవారం తెలిపారు. శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి కూడా అయిన దిస్సనాయకె తన 2025 బడ్జెట్ ప్రతిపాదన సమయంలో అదానీ గ్రీన్ ఎనర్జీ పేరు ప్రస్తావించకుండానే ‘4.65 యుఎస్ సెంట్లకు వాయు విద్యుత్ సరఫరాకు మాకు ఆఫర్ వచ్చినందున 8.26 సెంట్లకు ఆఫర్ వదులుకోవడంపై విచారించవలసిన అవసరం లేదు’ అని అన్నారు. శ్రీలంక ఈశాన్య ప్రాంతంలో తమ హరిత విద్యుత్ ప్రాజెక్టు
కోసం 400 యుఎస్ మిలియన్ డాలర్ల పెట్టుబడిపై నిష్క్రమిస్తున్నామని అదానీ క్రితం వారం ప్రకటించారు. ‘ఒక మదురి దేశం వీడారంటూ వగస్తున్నవారు ఉన్నారు’ అని దిస్సనాయకె వ్యాఖ్యానించారు. ఎన్‌పిపి ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారులను భయపెడుతున్నాయన్న ప్రతిపక్షాల విమర్శను ప్రస్తావిస్తూ ఆయన ఆ వ్యాఖ్య చేశారు. అదానీ వాయు విద్యుత్ ప్రాజెక్టును సమీక్షించాలని, విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తిరిగి సంప్రదింపులు జరపాలని దిస్సనాయకె ప్రభుత్వం డిసెంబర్ చివర్లో నిర్ణయించిన తరువాత అదానీ గ్రూప్ ఆ ప్రాజెక్టు నుంచి నిష్క్రమించింది.