న్యూఢిల్లీ : గత 2019 సంవత్సరం నుంచి అదానీ గ్రూప్ సంస్థల్లో 2.87 బిలియన్ డాలర్ల (రూ.23,541 కోట్లు) వాటాల విక్రయం వివరాలను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ సోమవారం వెల్లడించింది. అదానీ గ్రూప్‌లోని బినామీ కంపెనీల నుంచి వచ్చిన రూ.20 వేల కోట్లకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పదే పదే విమర్శలు చేశారు. దీనికి కౌంటర్ ఇస్తూ అదానీ గ్రూప్ కంపెనీల విక్రయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
2019 నుంచి గ్రూప్‌లోని కంపెనీలు దాదాపు 2.87 బిలియన్ డాలర్ల (రూ.23,541 కోట్లు) విలువ చేసే వాటాలను విక్రయించాయని పేర్కొంది. దీనిలో 2.55 బిలియన్ డాలర్లు (రూ.20,900 కోట్లు) వ్యాపార విస్తరణ కోసం మళ్లీ పెట్టుబడి పెట్టినట్టు సంస్థ వెల్లడించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు అతలాకుతలం అయ్యాయి. అప్పటి నుంచి రాహుల్ గాంధీ హిండెన్‌బర్గ్ నివేదిక పేరుతో అదానీ గ్రూప్ కంపెనీల లెక్కలు చెప్పాలంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీనికి బదులిచ్చేందుకు ఈ వివరాలను అదానీ గ్రూప్ ఇప్పుడు ప్రకటించింది.
అదానీ గ్రూప్ నామినీ ఎన్‌డిటీవీ బోర్డుకు రాజీనామా
అదానీ గ్రూప్ బ్రాండ్ కస్టోడియన్, కార్పొరేట్ వ్యవహారాల అధిపతి అమన్ కుమార్ సింగ్ ఎన్‌డిటీవీ బోర్డు నుండి రాజీనామా చేశారు. ఇతర వ్యాపారాల కారణంగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో అవినీతి కేసు నడుస్తోంది. న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్‌డిటీవీ) గత వారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అమన్ కుమార్ సింగ్ ఏప్రిల్ 1 నుండి కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపింది. అమన్ కుమార్ 2022 సంవత్సరంలో ఉద్యోగాన్ని విడిచిపెట్టి, అదానీ గ్రూప్‌లో చేరారు. 2022 నవంబర్‌లో ఆయన అదానీలో బ్రాండ్ కస్టోడియన్ కావడానికి ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. అదే సమయంలో అదానీ గ్రూప్ ఎన్‌డిటివిని కొనుగోలు చేసినప్పుడు గ్రూప్ అతన్ని డైరెక్టర్ల బోర్డులోకి తీసుకుంది.