Saturday, November 16, 2024

బోనులో ప్రధాని!

- Advertisement -
- Advertisement -

అదానీ షేర్ మార్కెట్ కుంభకోణం పార్లమెంటును కుదిపి వేస్తున్నది. సంయుక్త పార్లమెంటరీ (జెపిసి) కమిటీ ద్వారా గాని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో గాని విచారణ జరిపించాలని ఐక్యప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. ఈ వ్యవహారం బడ్జెట్ సమావేశాల కాలాన్ని గరిష్ఠంగా హరించే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ స్పీకర్ గాని, రాజ్యసభ చైర్మన్ గాని ఈ డిమాండ్‌కు అంగీకరించాలని పాలక పక్షాన్ని కోరే అవకాశం బొత్తిగా లేదు. అలాగే పాలక బిజెపి ఈ సమయంలో ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించదు. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలది పైచేయి కానివ్వడం దానికి మేలు చేసే పరిణామం కాదు. ఒకవేళ జెపిసి నియామకానికి ప్రభుత్వం ఒప్పుకొన్నా దాని వల్ల కలిగే ప్రయోజనం సున్నాయేనని గత చరిత్ర నిరూపిస్తున్నది.

గత మూడు దశాబ్దాల్లో నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీల నుంచి ఒరిగిందేమీ లేదు. పార్లమెంటులో పార్టీల బలాలను బట్టి జెపిసిలో వాటికి ప్రాతినిధ్యం వుంటుంది. ఆ విధంగా జెపిసిలో కూడా పాలక పక్షానికే మెజారిటీ ప్రాతినిధ్యం లభిస్తుంది. తీరా జెపిసి ఎటువంటి తీవ్రమైన సిఫారసులతో నివేదిక సమర్పించినా దానిని ప్రభుత్వం యధాతథంగా ఆమోదించే అవకాశాలు లేనేలేవు. అలాగే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగినా వాస్తవాలు నిర్ధారణ అయి అదానీకి శిక్ష పడుతుందనే గ్యారంటీ వుండదు. గుజరాత్ అల్లర్లపరంగా ప్రధాని నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంఘం (సిట్) నిర్వహించిన శోధన ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడానికే తోడ్పడింది.

అదానీ సంస్థలు తమ షేర్లను తాకట్టు పెట్టి జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) వంటి బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొన్నట్టు తెలుస్తున్నది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ మార్కెట్ మాయాజాలాన్ని బయటపెట్టిన తర్వాత వరుసగా 6 రోజుల్లో అదానీ సంస్థల షేర్ల విలువ రూ. 8.76 లక్షల కోట్ల మేరకు పడిపోయింది. అందుచేత ఆ షేర్ల మీద పెట్టిన భారీ మొత్తాలను ఎల్‌ఐసి, ఎస్‌బిఐ వంటి బ్యాంకులు నష్టపోయినట్టేనా అనేది తేలవలసి వుంది. గత కొన్ని సంవత్సరాలుగా అదానీ గ్రూపు షేర్ల మీద తాను పెట్టిన మదుపు రూ.30,127 కోట్లని ఎల్‌ఐసియే చెప్పుకొన్నది. ఈ షేర్ల విలువ రూ. 8 లక్షల కోట్లకు పైగా పడిపోయిన తర్వాత దానికి ఎంత నష్టం కలిగింది, అలాగే రూ. 27 వేల కోట్లకు మించి అదానీ సంస్థలకు రుణాలు ఇచ్చినట్టు చెబుతున్న ఎస్‌బిఐ మరెంత దెబ్బ తిన్నదో ఆరా తీయవలసి వుంది.

తాను అదానీ షేర్ల మీద మదుపు పెట్టలేదని ఎస్‌బిఐ అంటున్నది. అదానీ సంస్థలకు ఎంతెంత రుణాలు ఇచ్చాయో వివరాలు చెప్పాలని బ్యాంకులను రిజర్వు బ్యాంకు అడిగింది. విదేశాల్లో ఉత్తుత్తి కంపెనీల బోర్డులు పెట్టి వాటి పేరు మీద డబ్బును తమ సంస్థల షేర్లకు తరలించడం ద్వారా వాటి మార్కెట్ విలువను పెంచి ప్రజల నుంచి అపారంగా మదుపు పెట్టించిన అదానీ అక్రమం మీద ఇంత కాలం సెబి (సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) ఎందుకు నిఘా పెట్టలేదనేది కీలకమైన ప్రశ్న. అలాగే ఈ విషయంలో ఫెమా (ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ చట్టం) ఎందుకు నిద్ర తీస్తూ వచ్చిందనేదీ సమాధానం కోరవలసిన అంశమే. ఈ సంస్థలు, ఎల్‌ఐసి, బ్యాంకులు మొత్తంగా ప్రధాని మోడీ ప్రభుత్వం అదుపాజ్ఞల్లోనే పని చేస్తున్నందున, ఆయనకు ప్రీతిపాత్రుడైన అదానీ విషయంలో అవి మెతకగా, మన్ను తిన్న పాముల్లా వ్యవహరించాయని అనుకోవాలి.

దేశ ఆర్థిక రంగం మీద ఇంత పెద్ద ఎత్తు మోసం, దగా, కుట్ర సాగిందని ఒక విదేశీ పరిశోధన సంస్థ బయట పెట్టిన తర్వాత ప్రజల సొమ్ముకు కాపలా కాయవలసిన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోడీ మౌనం వహించడం నేరాన్ని ఒప్పుకోడంగా భావించాల్సిందేనా? ఈ కుంభకోణం లోతులు తెలుసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎల్‌ఐసి గాని, బ్యాంకులు గాని మోసపోయి వుంటే వాటి సొమ్మును, మదుపరుల డబ్బును వారి నుంచి కక్కిస్తామని మోడీ స్వయంగా ఈసరికే ప్రకటించి వుండవలసింది. కాని అది జరగలేదు.

పైపెచ్చు ఈ కుంభకోణంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడైన వారం రోజులకు ప్రకటించారు. ప్రజలకు జవాబుదారీగా వుండవలసిన ప్రభుత్వం వారికి ముఖం చూపించే ధైర్యం లేకనే ఇటువంటి బాధ్యతారహిత ప్రకటన చేసిందని స్పష్టపడుతున్నది. ప్రపంచ అత్యంత సంపన్నుల వరుసలో మూడో పీఠాన్ని అధిరోహించిన అదానీ దేశ ప్రజల పొదుపు సొమ్మును భారీగా దోచుకొన్నట్టు ఆధారాలతో వెల్లడైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం పాత్ర రుజువవుతూనే వున్నది. ఇందుకు బాధ్యత వహిస్తూ పార్లమెంటులో ప్రధాని మోడీ వివరమైన ప్రకటన చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News