న్యూఢిల్లీ : ఎన్‌డిటివి(న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్) వాటాదారులకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఓపెన్ ఆఫర్ కింద అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. షేర్లకు అదనంగా రూ.48.65 ఆఫర్ చేస్తోంది. ఓపెన్ ఆఫర్ కింద కొనుగోలు చేసిన ఎన్‌డిటివి షేర్ల కోసం అదానీ గ్రూప్ వాటాదారులకు అదనపు డబ్బు చెల్లించనుంది. అదానీ గ్రూప్ కంపెనీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ నుండి షేర్లను రూ. 342.65 ధరతో కొనుగోలు చేసింది. ఇది ఓపెన్ ఆఫర్ ధర రూ. 294 కంటే ఎక్కువ, అయితే కంపెనీ ఓపెన్ ఆఫర్‌లో షేర్లు విక్రయించిన వారికి ఒక్కో షేరుపై అదనంగా రూ.48.65 చెల్లించనుంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ నిర్ణయం గురించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేసింది. దీంతో ఓపెన్ ఆఫర్‌లో కొనుగోలు చేసిన షేర్ల ధర కూడా ఒక్కో షేరుకు రూ.342.65కి చేరింది. ఆర్‌ఆర్‌పిఆర్ హోల్డింగ్, విశ్వప్రధాన్ కమర్షియల్ అనే రెండు అనుబంధ సంస్థల ద్వారా ఎన్‌డిటివిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ సొంతం చేసుకున్న మొత్తం హోల్డింగ్ 64.72 శాతానికి చేరుకుంది. మంగళవారం ఎన్‌డిటివి షేరు 1.71 శాతం లాభంతో రూ.345 వద్ద ట్రేడయింది. గత సంవత్సరంలో ఎన్‌డిటివి స్టాక్‌లో చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఈ షేరు కూడా గరిష్టంగా రూ.567ను చేరగా, కనిష్టంగా రూ.103కి చేరుకుంది.