తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ చేజిక్కించుకోవడంతో తిరువనంతపురం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ శుక్రవారం హర్షాన్ని వ్యక్తంచేశారు. మంచి జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. కేరళ రాజధాని అభివృద్ధి దృష్టా అదానీ గ్రూపుకు ప్రజలు మద్దతునివ్వగలరని కూడా అన్నారు. సమ్మెలతో అభివృద్ధిని సాధించలేమని, తిరువనంతపురం అభివృద్ధికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విమానాశ్రయం అవసరమని అన్నారు. చక్కని, పరిశుభ్రమైన విమానాశ్రయం ఉండాలన్నారు. నాణ్యత ఉంటే కేరళ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకల సంఖ్య పెరుగుతుందని శశి థరూర్ తెలిపారు. విమానాశ్రయాల ప్రైవేటీకరణకు మద్దతునిస్తున్నట్లు ఆయన అభిప్రాయాలున్నాయని విలేకరులు అన్నప్పుడు “ఐ గో ఫార్వర్డ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్” అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కేరళ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించడాన్ని అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ వ్యతిరేకించినప్పటికీ శశిథరూర్ మాత్రం ప్రైవేటీకరణను సమర్థించారు. విమర్శలు వచ్చినప్పటికీ ఆయన తన వైఖరి మార్చుకోలేదు. ఆయనను వామపక్షాలే కాదు, ఆయన స్వంత పార్టీ కాంగ్రెస్ కూడా విమర్శించింది. ఇదిలావుండగా రాజకీయవేత్తగా మారిన నటుడు, రాజ్యసభ సభ్యుడు సురేశ్ గోపి కూడా తిరువనంతపురం విమానాశ్రయం ప్రైవేటీకరణను స్వాగతించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ “ఎప్పుడైతే విమానాశ్రయాన్ని ఉపయోగించుకునేవారు సంతృప్తి చెందుతారో అప్పుడు ఇలాంటి విమర్శలు క్రమేణా ముగిసిపోతాయి” అన్నారు.