Monday, December 23, 2024

అదానీకి క్లీన్ చిట్!

- Advertisement -
- Advertisement -

స్టాక్ మార్కెట్‌ను మోసం చేసి, విదేశాల్లో నెలకొల్పిన డొల్ల కంపెనీల ద్వారా తన డబ్బుతో తన షేర్లే కొని వాటి విలువను కృత్రిమంగా పెంచి అడ్డదారిలో ఐశ్వర్య వంతుడయ్యాడన్న హిండెన్ బర్గ్ ఆరోపణ నుంచి గుజరాతీ కార్పొరేట్ సామ్రాట్ గౌతమ్ అదానీకి విముక్తి లభించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ మేరకు బుధవారం నాడు ఇచ్చిన తీర్పు అదానీని నిర్దోషిగా ప్రకటించడంతో ఆయన గ్రూపు కంపెనీల షేర్లు మళ్ళీ పుంజుకొన్నాయి. అదానీ గ్రూపు తప్పు చేయలేదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి చేసిన నిర్ధారణను ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం ధ్రువపరిచింది. మొత్తం 24 కేసులలో 22 ను శోధించి అదానీని దోష రహితుడుగా ప్రకటించిన సెబి తీర్పును శంకించవలసిన పని లేదని స్పష్టం చేసింది. సిబిఐ, సిట్ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా అదనపు విచారణకు ఆదేశించాలన్న పిటీషనర్ల విజ్ఞప్తిని తిరస్కరించింది. గౌతమ్ అదానీ మామూలు కార్పొరేట్ యజమాని కాడు.

రాజకీయ అత్యున్నత పదవులలోని వారితో సన్నిహిత సంబంధాలున్నవాడు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీకి బాగా దగ్గరివాడు. మోడీ మొట్ట మొదటి సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదానీ విమానంలోనే తిరిగి గుజరాత్ వెళ్ళారు. మోడీ స్వయంగా సిఫారసు చేసి శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో అదానీకి మేలు చేశారు. దేశంలో ఆయనకు రేవులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు వంటివి కేటాయించారు. ఆశ్రిత పెట్టుబడిని ఆ విధంగా పరాకాష్ఠకు చేర్చారు. అదానీ షేర్ల విలువను పాతాళానికి తొక్కివేసిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక బయటపడిన తర్వాత ఆయనతో తనకి గల సఖ్యత నేపథ్యంలో పార్లమెంటులో ప్రతిపక్షం మోడీపై తీవ్రంగా విరుచుకు పడింది. అందుకు సభాముఖంగా సమాధానం చెప్పకుండా ఆయన తప్పించుకొన్నారు. ఇంతటి వివాదాస్పద నేపథ్యం వున్న వ్యాపారస్థుడు, చూస్తుండగా ప్రపంచ మూడవ ఐశ్వర్యవంతుడుగా ఎదిగిన వ్యక్తి కావడం వల్లనే అదానీకి చెందిన పరిణామాలను ప్రపంచం ప్రత్యేక దృష్టితో చూస్తుంది. అందుచేత సెబి నిర్ధారణతో సుప్రీం కోర్టు సంతృప్తి చెందడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం కావడాన్ని తప్పు పట్టలేము. ఫారిన్ పోర్టిఫోలియో ఇన్వెస్టర్స్ రెగ్యులేషన్ (ఎఫ్‌పిఐ) లిస్టింగ్ అబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వర్‌మెంట్ (ఎల్‌ఒడిఆర్) నిబంధనలను సెబి సవరించడం,

సడలించడంతో అదానీ గ్రూపు ఆ సందులను ఉపయోగించుకొని మోసాలకు పాల్పడిందనే అభిప్రాయం వున్నదని అందుచేత వాటిని రద్దు చేయాలని పిటిషనర్లు చేసిన డిమాండ్‌ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ విషయంలో సెబి అధికారాల్లో జోక్యం చేసుకోడానికి సుప్రీం కోర్టుకు గల అధికారాలు పరిమితమని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ సప్రే కమిటీ సభ్యులపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వంటి పిటిషనర్లు చేసిన ఆరోపణలనూ ధర్మాసనం కొట్టి పారేసింది. సెబిని సుప్రీం కోర్టు పూర్తిగా విశ్వసించింది. అందుచేత అదానీ పైన ఈగవాల లేదు. కాని హిండెన్ బర్గ్ ఎత్తి చూపించిన కుంభకోణాన్ని స్టాక్ మార్కెట్ మదుపరులు నమ్మారు. అందుచేతనే ఆ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూపు షేర్ల విలువ 19.2 లక్షల కోట్ల రూపాయల నుంచి 6.8 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. ఆ మేరకు మదుపరులు భారీగా నష్టపోయారు. సెబి నిర్దోష నిరూపణ వల్ల దానిని సుప్రీం కోర్టు ధ్రువపరచడం వల్ల హిండెన్ బర్గ్ దురుద్దేశ పూర్వకంగా అదానీ పై బురద చెల్లినట్టు భావించాలి. తగిన ఆధారాలు లేకుండా పిటిషన్లు దాఖలు చేయొద్దని లాయర్లను, పౌర సమాజ సభ్యులను సుప్రీం కోర్టు హెచ్చరింది. ప్రభుత్వ అదుపుకి అతీతం కాని సెబికి సుప్రీం కోర్టు తీర్పుతో పవిత్రత కలిగింది.

హిండెన బర్గ్ నివేదికను గట్టిగా నమ్మి అదానీని తప్పు పడుతూ మీడియాలో వ్యాసాలు, వ్యాఖ్యలు రాసిన వారంతా తమ పరిశీలనా దృష్టిని తామే అనుమానించవలసిన పరిస్థితి ఇప్పుడు తలెత్తింది.మోడీ ప్రధాని కావడానికి ముందు అదానీ గ్రూపు వ్యవహారాలను అనుమానించిన సెబి ఆ తర్వాత దానిని కొనసాగించలేదనే విమర్శకు అది ఇచ్చిన వివరణను కూడా ధర్మాసనం అంగీకరించింది. మొత్తానికి అధికార పదవుల్లోని వారి దన్నుతో సాగిందని దేశమంతటా హోరెత్తిన అతిపెద్ద మార్కెట్ కుంభకోణంపై తెర పడిపోయింది. దీనితో ఈ తీర్పు వెలువడిన ఈ నెల మూడో తేదీన అదానీ గ్రూపు షేర్‌ల విలువ మళ్ళీ 15.1 లక్షల కోట్ల రూపాయలకు చేరుకొన్నది. అదానీపై ఆరోపణలను సిబిఐకి గాని, సిట్‌కు గాని అప్పగించాలన్న అభ్యర్థను కొట్టి వేయడం ద్వారా ఈ తీర్పు అమిత ఔదార్యాన్ని చూపిందని కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్య గమనించదగినది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News