“ధర్మాన్ని కాపాడండి! అది అందర్నీ కాపాడుతుంది! ధర్మాన్ని కాపాడాల్సిన సజ్జనులు కూడా దుర్జనుల వెంట నిలిచినా సరే; అంతిమంగా ధర్మమే తనను తాను కాపాడుకుంటుంది! ఆ క్రమంలో దుర్జనులతో సహా వారి వైపు నిలిచిన సజ్జనులు కూడా నశిస్తారు, తస్మాత్ జాగ్రత్తని ప్రబోధిస్తున్నది మహాభారతం!” ఉ॥ ధర్మ(కురు) క్షేత్రంలో దుర్జన కౌరవులతో సహా, కారణమేదైనా వారి వెంట నిలిచిన భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాది సజ్జనులు కూడా నశించటమే అందుకు నిదర్శనం! నాడు దుష్ట హిట్లర్‌తో సహా అతని వెంట నడిచిన అన్య దేశాల వారూ విధ్వంసానికి గురికావడం చారిత్రక నిదర్శనం! మారిషస్ వంటి పన్ను స్వర్గధామాలలో అదానీ బంధు మిత్రులు నెలకొల్పిన 38 అడ్రసు లేని షెల్ కంపెనీలకు తరలింపబడిన నల్లధనంతో తిరిగి అదానీ కంపెనీల షేర్లను అధిక ధరలకు కొంటూ కృత్రిమంగా పెంచిన షేరు విలువలను చూపి ప్రభుత్వ బ్యాంకుల నుండి 30%, ప్రైవేటు బ్యాంకుల నుండి 10% మొత్తం 40% రుణాలను పొందటం.
ప్రధాని పేరు చెప్పుకుంటూ ఎల్‌ఐసి వంటి విశ్వసనీయ సంస్థ చేత భారీగా తన కంపెనీ షేర్లను కొనిపించుట ద్వారా ప్రజా విశ్వాసాన్ని పెంచి, వాళ్ళతో అత్యధిక ధరకు భారీగా షేర్లు కొనిపించి, ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానానికి చేరిన అదానీ బండారాన్ని బట్టబయలు చేసింది అమెరికాకు చెందిన “ఆర్థిక అక్రమాల పరిశోధనా మెకంజీ సంస్థ” నాటి నుండి అదానీ కంపెనీ షేర్లు ఆకాశం నుండి పాతాళానికి అదానీ రెండో స్థానం నుండి పదో స్థానం దిశగా పతన మార్గం పట్టారు. తద్వారా భారత బ్యాంకులతో సహా ఆర్థిక వ్యవస్థ కూడా సంక్షోభానికి గురౌతామన్న ఆందోళనకు గురయ్యారు భారతీయులు. మెకన్జీ నివేదికకు కౌంటర్‌గా ఇది నా మీద కాదు, భారత దేశ ఆర్థిక వ్యవస్థ మీదనే దాడియని, ఇది మెకన్జీ వారి బూటకపు నివేదికనీ, ఈ సంస్థను అంతర్జాతీయ న్యాయ స్థానంలోబోనులో నిలుపుతామంటూ ఎదురు దాడికి దిగాడు అదానీ! అయినా సరే ఆయన స్థానం, కంపెనీల షేర్లు పతన మార్గాన జారుతూనే వున్నాయి. అతనేమైతే ఎవరికేం గాని అతని షేర్లు గొన్న ప్రజలు, అప్పులిచ్చిన బ్యాంకులు, ఎల్‌ఐసి తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు మునుగుతాయోనన్న భయప్రకంపనలు చెలరేగుతున్నాయి.
అయినా ప్రధాని నోరు విప్పటం లేదెందుకని? ఈ విషయంలోనే కాదు, గుజరాత్ మారణకాండకు మోడీ, అమిత్ షాలనే ప్రధాన కారకులుగా చూపుతున్న బిబిసి వారి వీడియోను గూర్చి కూడా నోరు విప్పడం లేదు మోడీ, షాలు! బిజెపి మాత్రం ఇది మోడీ మీద చేస్తున్న దాడి కాదు భారత దేశం మీద, మోడీ, షాలకు క్లీన్ చిట్ ఇచ్చిన భారత సుప్రీంకోర్టు మీద బిబిసి చేస్తున్న దాడి ఇది, అసలు బిబిసి విశ్వసనీయ సంస్థే కాదు, బిబిసి వీడియోను పట్టించుకోవాల్సిన పనే లేదు, రానున్న ఎన్నికల్లో మోడీని ఓడించడానికి జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమిది. అంటూ ఎదురు దాడికి దిగింది. ఈ నేపథ్యంలో బిబిసి వారి కౌంటర్ ఇలా వుంది. మేము ఇప్పుడు తీసిన వీడియో కాదిది నాడు మీరు తొక్కి పెట్టిన వీడియో క్లిప్పింగులని వెలికి తీసి యథాతథంగా రూపొందించిన వీడియోనే ఇది. సాక్షులను, సాక్షాధారాలను కోర్టు ముందుకు రాకుండా నిర్బంధించినప్పుడు సుప్రీంకోర్టు అయినా ఏం చేయలేకనే క్లీన్‌చిట్ ఇచ్చింది. అంత మాత్రాన, నేరం ఎలా మాసిపోతుంది? బ్రిటిష్ వలస పాలనలో భారత్‌లో ముఖ్యంగా బెంగాల్లో సంభవించిన కరువుకు లక్షలాది భారతీయుల మరణ దృశ్యాలను చిత్రించి అందుకు నాటి బ్రిటిష్ ప్రధాని చర్చిల్‌నే ప్రధాన బాధ్యుడని నిర్భయంగా చెప్పిందిగదా బిబిసి! ఇందిరా హయాంలో నిర్బంధానికి గురై భారతీయ మీడియా మౌనం వహించినా ఎమెర్జెన్సీ దురాగతాలను భారతీయులతో సహా ప్రపంచమంతా తెల్సుకోగలిగింది.
బిబిసి ద్వారానే కదా? నాడు ఇందిర వ్యతిరేక పార్టీల కూటమిలో చేరిన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు బిబిసిని ఆకాశానికెత్తారు కదా! సాక్షాత్తు నరేంద్ర మోడీ ఒక ఎన్నికల సభలో “భారతీయ దూరదర్శన్ కన్నా బిబిసి ఎన్నో రెట్లు విశ్వసనీయమైందని” ప్రశంసించారు గదా! మరి నాడు ‘ఇందిరయా’గా నేడు ‘మోడీయా’గా మారిన భారతీయ మీడియా చెప్పలేని నిజాలను బిబిసి ద్వారా తెలుసుకోవడం జాతి విద్రోహమా, మోడీజీ? నాడు ‘మౌనముని’ అంటూ మన్మోహన్ సింగ్‌ను ఎద్దేవా చేసిన తమరు నేడలాగే ప్రవర్తించడం భావ్యమా మోడీజీ! బిఆర్‌ఎస్, వామపక్షాల తో పాటు, ప్రాంతీయ, జాతీయ పార్టీలు, మీడియా, మేధావు లందరూ మెకన్జీ నివేదిక సంబంధంచిన ప్రశ్నలకు జవాబు చెప్పి,ప్రజలకు భరోసా కల్పించాల్సిందిగా ప్రధాని మోడీని, ఆరోపిత అదానీని స్పందింపజేయకుంటే అందరమూ ఆర్థిక సంక్షోభ సుడిగుండంలో పడతామేమో ఆలోచించండి భారతీయ సహోదరులారా!
వనం వెంకటేశ్వర్లు
9848997240