ముంబై : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గురువారం ఇక్కడ ఎన్‌సిపి నేత శరద్ పవార్‌ను ఆయన నివాసం లో కలిశారు. అదానీ హిండెన్‌బర్గ్ వివాదోదాంతంలో నిజానిజాలను తేల్చేందుకు జెపిసి దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్న దశలో ఈ వ్యాపార దిగ్గజం సీనియర్ నేతను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం ఉదయం సిల్వ ర్ ఓక్‌లోని పవార్ నివాసానికి అదానీ చేరుకున్నారని, అక్కడ దాదాపు రెండు గంటల పాటు ఉన్నారని వెల్లడైంది. దేశంలోని పలు ప్రతిపక్షాలు అదానీని అనేకరకాలుగా విమర్శిస్తూ వస్తున్నాయి. అదానీ మోడీ బంధంతోనే ఆయన వ్యా పార సంస్థలకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు అందిన విషయాన్ని హిండెన్‌బర్గ్ నివేదిక స్పష్టం చేసిందని విపక్షాలు పార్లమెంట్‌లోనూ వెలుపల దాడికి దిగుతున్నాయి.
అయితే ఈ మధ్యకాలంలోనే శరద్ పవార్ ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో అదానీ సంస్థ కార్యకలాపాలను సమర్ధించారు. ఆయన వ్యాపార సముదాయాలతో దేశానికి మేలే జరుగుతోందని, విపక్షాలు అదేపనిగా ఊరికే అదానిపై ఆరోపణలకు దిగడం వల్ల ఫలితం లేదని, సరైన విషయాలు వాస్తవికతతో ఉంటే విమర్శలకు దిగడం, జెపిసి దర్యాప్తునకు పట్టుపట్టడం సముచితం అవుతుందని తేల్చిచెప్పారు. దేశంలో ప్రతిపక్ష ఐక్యత దిశలో ఓ వైపు యత్నాలు సాగుతున్న దశలోనే పవార్ అదానీని సమర్థించడం, ఇప్పుడు అదానీ పవార్ నివాసానికి వెళ్లడం వంటి పరిణామాలు కీలకంగా మారాయి.