Monday, December 23, 2024

ఇరకాటంలో మోడీ

- Advertisement -
- Advertisement -

గుజరాత్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిపెట్టి అక్కడ బిజెపిని వరుసగా ఏడోసారి అధికారంలోకి తెచ్చానన్న ఆనంద సాగర విహారంలో వున్న ప్రధాని మోడీని వున్నట్టుండి కొరకరాని కొయ్యల్లాంటి రెండు సమస్యలు వేధించడం ప్రారంభించాయి. ఇందులో ఒకటి 2002 నాటి గుజరాత్ అల్లర్లపై బిబిసి విడుదల చేసిన డాక్యుమెంటరీ వివాదం కాగా, మరొకటి మోడీకి అత్యంత సన్నిహితుడు, గుజరాత్‌కే చెందిన గౌతమ్ అదానీ షేర్ మార్కెట్ ద్వారా ప్రజల సొమ్మును అడ్డదారుల్లో కొల్లగొట్టాడన్న సంచలన కథనం. ఈ రెండింటిలో మొదటిది అతి పెద్ద ప్రజాస్వామ్యదేశానికి ప్రధాని స్థానంలో వుండి భావ ప్రకటనా స్వేచ్ఛకు సమాధి కట్టాడని అంతర్జాతీయంగా ఆయనకు తీవ్ర అప్రతిష్ఠను మూటగట్టింది.

రెండోది గౌతమ్ అదానీ వ్యాపార వ్యవహారాల వెనుక ఏమున్నదో తెలుసుకోకుండా ఆయనను అనతి కాలంలోనే ప్రపంచ ఐశ్వర్య శిఖరం ఎక్కించడానికి తనకున్న సరాధికారాలను ఉపయోగించి చివరికి అటువంటి అక్రమార్కుడికి దన్ను నిలిచాడనే అపఖ్యాతికి వీలు కల్పించింది. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఈ రెండు అంశాలపైనే మాట్లాడుకొంటున్నారు. బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) కి వున్న పేరు ప్రఖ్యాతులు అసాధారణమైనవి. ఒకప్పుడు రేడియో సిలోన్‌ను ప్రజలు ఎంతగా ఆదరించేవారో అదే విధంగా బిబిసిని ఇప్పటికీ చాలా వరకు నమ్మదగ్గ సమాచార ప్రసార సంస్థగా పరిగణిస్తున్నారు. చెప్పడానికి సిగ్గుపడే అమానుషాలతో 2000 మందిని బలి తీసుకొని ఎంతో మందిని నిర్వాసితులను చేసిన గుజరాత్ అల్లర్లు అప్పుడు ముఖ్యమంత్రిగా వున్న నరేంద్ర మోడీ అండదండలతోనే సాగిపోయాయని బిబిసి డాక్యుమెంటరీ ప్రపంచానికి తెలియజేసింది.

ముఖ్యమంత్రి ఏమీ చేయడనే ధీమాతోనే హిందుత్వ సంస్థలు రెచ్చిపోయాయని అసలు దోషి మోడీయేనని ఈ డాక్యుమెంటరీ పేర్కొన్నది. గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్రను రుజువు చేయడానికి తగినంత సాక్షాధారాలు లేవని సిట్ తేల్చడంతో సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అంతటితో గండం గడిచిందనుకొన్న మోడీని బిబిసి డాక్యుమెంటరీ తిరుగులేని రీతితో బోనులో నిలబెట్టింది. ఈ డాక్యుమెంటరీ వెలువడిన వెంటనే యూట్యూబ్ నుంచి, టిట్టర్ నుంచి భారత ప్రభుత్వం దానిని తొలగింప చేసింది. దీనిని ప్రదర్శించబోతున్నారన్న సంగతి తెలుసుకొని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) లో మంగళవారం నాడు రాత్రి ఢిల్లీ పోలీసులు విద్యుత్తును, ఇంటర్‌నెట్‌ను ఆపివేశారు. ఈ డాక్యుమెంటరీని చూడబోతున్న సమయంలో ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయ విద్యార్థులను అరెస్టు చేశారు.

 

మనది గొప్ప ప్రజాస్వామ్యమని రిపబ్లిక్ దినోత్సవం నాడు ఘనంగా చెప్పుకొన్న కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం గమనించవలసిన విషయం. గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్రపై బిబిసి వరుసగా రెండో డాక్యుమెంటరీని కూడా విడుదల చేసింది. వీటిని చూసే అవకాశం భారతీయులకు కలగకపోయినా ప్రపంచమంతా అందులోని విషయాలను ఈసరికే తెలుసుకొన్నది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడం లేదని అనుకొంటుందట. ప్రధాని మోడీ బిబిసి డాక్యుమెంటరీ విషయంలో వ్యవహరించిన తీరు సరిగ్గా అలాగే వుంది. ఈ డాక్యుమెంటరీల నిషేధం మీద అమెరికా స్పందించిన తీరు ప్రధానికి తలకొట్టేసినట్టు వుండడం సహజం. ప్రపంచ వ్యాప్తంగా మీడియా స్వేచ్ఛను తాము కోరుకొంటున్నామని అమెరికా ప్రకటించింది. దేశదేశాల్లోని తిరుగుబాటు గళాలను వినిపించనీయకుండా, విననీయకుండా చేయడంలో దాని ఘనత తక్కువేమీ కాదుగాని అగ్ర రాజ్యంగా అది మోడీ ప్రభుత్వాన్ని బహిరంగంగా వేలెత్తి చూపించడం మామూలు విషయం కాదు.

భావ ప్రకటనా స్వేచ్ఛను, మతావలంబన స్వేచ్ఛను మానవ హక్కులుగా తాము పరిగణిస్తామని అవి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తాయని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అదానీ వ్యవహారమైతే ప్రపంచ మంతటా దుర్గంధాన్ని వ్యాపింప చేస్తున్నది. దేశంలో మోడీ ప్రభుత్వానికి భయపడి దాని తీవ్రతను తెలియనీయకుండా చేస్తున్నారు గాని, హిండెన్‌బర్గ్ నివేదికతో దేశీయ షేర్ మార్కెట్ కుప్పకూలిపోయిన తీరు అదెంత లోతైన కుంభకోణమో చాటుతున్నది. అన్నింటికీ మించి ప్రజలు తమ పొదుపు సొమ్మును దాచుకొంటున్న జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి), స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)ల నిధులు భారీ ఎత్తున అదానీ ఊబిలో వ్యర్థమైపోయాయన్న సమాచారం ఆందోళనకరమైనది. ఇవి చాలా పెద్ద సంస్థలు కాబట్టి అదానీ వల్ల వీటికి వాటిల్లుతున్న నష్టం చెప్పుకోదగినది కాదని వాటికి పెనుముప్పు ఏర్పడబోదని కొందరు నిపుణులు చెబుతున్నప్పటికీ ఆమేరకైనా ప్రజల సొమ్ము బూడిదలో కలవడం సాధారణ విషయం కాదు. ఇలా ఈ రెండు ఉదంతాల్లోనూ ప్రధాని మోడీ పరువు గంగలో కలిసిపోయింది. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువై వచ్చే లోక్‌సభ ఎన్నికలపై వీటి ప్రభావం వుండకపోతే పోవచ్చు గాని ఈ ఏడాదిలో జరగనున్న అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపు అవకాశాలను దెబ్బ తీసే సూచనలైతే కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News