Monday, December 23, 2024

అదానీ బండారం!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు, ఇష్టుడు అయిన గుజరాత్ వ్యాపారి గౌతమ్ అదానీ సిరుల శిఖరాల వెనుక అతి పెద్ద కుట్ర దాగి వున్నదని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే అంతర్జాతీయ సంస్థ వెల్లడించిన సమాచారం సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్నుడి స్థాయికి అదానీ అనతికాలంలోనే ఎదిగిపోడం అంతర్జాతీయ పరిశీలకులను ఆశ్చర్యం లో ముంచివేసిన సంగతి తెలిసిందే. దాంతో అదానీ ఐశ్వర్యంపై ఇటువంటి పరిశోధనలు నిరంతరం సాగుతూనే వున్నాయి. గతంలో క్రెడిట్ సైట్స్ అనే పరిశోధక కంపెనీ ఒక నివేదికను విడుదల చేస్తూ అదానీ గ్రూపుకి తగిన అర్హత లేకున్నా అవకాశాలు లభిస్తున్నాయని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఈ గ్రూపు పెద్దలతో క్రెడిట్ సైట్స్ సమావేశమైంది.

దానితో అది మెత్తబడి తన విమర్శను కూడా మెత్తబరిచింది. ఇప్పుడు హిండెన్‌బర్గ్ తన నివేదికకు కార్పొరేట్ కంపెనీల చరిత్రలోనే అతి పెద్ద కంపెనీని ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్నుడైన అదానీ ఎలా నడిపిస్తున్నారు అనే శీర్షికతో విడుదల చేసింది. ఈ నివేదిక బయటపడడంతో బుధవారం ఒక్క రోజునే అదానీ గ్రూపుకి చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ 12 బిలియన్ డాలర్ల మేరకు అంటే రూ. 55 వేల కోట్ల కిమ్మత్తు పతనం కావడం మామూలు విషయం కాదు. ప్రభుత్వం దన్ను ఎంత వున్నా ప్రజల్లో విశ్వాసం కోల్పోతే ఏమి జరుగుతుందో ఈ పరిణామం నిరూపించింది. స్టాక్ మార్కెట్‌లో తప్పుడు విధానాలు అవలంబించి, దొడ్డి దారిలో డబ్బును చేరవేసి, రాని రాబడిని చూపించి అదానీ గ్రూపు అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆధారాలతో వెల్లడించింది. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఏ కంపెనీకి కూడా సాధ్యం కానంత రీతిలో అదానీ గ్రూపు షేర్ల విలువ పెరగడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది.

adani scandal

విదేశాల్లో డొల్ల కంపెనీల (ఎటువంటి వ్యాపారాలు లేకుండానే కేవలం బోర్డులు పెట్టి కథ నడిపించే సంస్థలు) పెట్టి, వాటి పేరిట డబ్బును స్వదేశంలోని తన సంస్థలకు మళ్లించడం ద్వారా షేర్ల విలువను విపరీతంగా పెంచుకొన్నాడని, ఆ విధంగా తన కంపెనీలకు లేని, రాని వ్యాపార లాభాలు షేర్ మార్కెట్‌లో చూపించుకొని కృత్రిమ మార్గంలో సంపదను అత్యంత వున్నత స్థాయికి చేర్చుకొన్నాడనేది హిండెన్‌బర్గ్ వెలికి తీసిన కీలక అక్రమం. ఇంకొక వైపు ప్రధాని మోడీకి అదానీ ఆత్మీయ స్నేహితుడనేది అనేక సార్లు బయటపడింది. నియమాలను ఉల్లంఘించి అహ్మదాబాద్, మంగళూరు, లక్నో, జైపూర్, గువహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను అదానీ సంస్థకు కట్టబెట్టినప్పుడే ఈ మైత్రి ఎంత లోతైనదో వెల్లడైండి.

మోడీ 2015లో బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు ఆ దేశానికి విద్యుత్తును అమ్మడానికి సంబంధించి 4.5 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని అదానీ సాధించుకొన్నాడు. ఆ ఒప్పందం ద్వారా తాము విద్యుత్తును అమ్మినా, అమ్మకపోయినా నిర్వహణ ఛార్జీల కింద బంగ్లాదేశ్ ప్రభుత్వం తమకు ఏటా 450 మిలియన్ డాలర్లు పొందే లా ఏర్పాటు జరిగిందని వెల్లడైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యం (పిపిపి) పేరిట కూడా ఇటువంటి బాగోతానికే తెర లేచింది. ఇటీవల ప్రధానీ మోడీ శ్రీలంక పర్యటనలో కూడా అదానీ ఇదే మాదిరిగా లబ్ధి పొందినట్టు బహిర్గతమైన విషయం తెలిసిందే. అది సిలోన్ ఎలెక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ పదవిని బలి తీసుకొన్నది. ప్రధాని మోడీయే స్వయంగా శ్రీలంక పాలకుల చెవిలో ఊది అదానీకి విద్యుత్తు ప్రాజెక్టును అప్పగించేలా చేసినట్టు వార్తలు వచ్చాయి.

ఆశ్రిత పెట్టుబడిదారీ అడ్డదారిని వెడల్పు చేయడం ద్వారా అదానీ అతి కొద్ది కాలంలోనే అత్యంత వేగంగా ప్రపంచ మూడవ సంపన్నుడయ్యాడని బోధపడుతున్నది. ఈ విషయం ముందే తెలిసినప్పటికీ హిండెన్‌బర్గ్ పరిశోధనతో అది దృఢమైంది. మన దేశంలో దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం మోడీ ప్రభుత్వానికి దాస్యం చేస్తున్నందున వాటి దర్యాప్తుల్లో అదానీ తప్పుడు వ్యాపారాల బండారం బయటపడే అవకాశం లేదు. కాని ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన తర్వాత ఆయన వ్యాపారాలు ఇక ముందు ఇదే పద్ధతిలో కొనసాగే అవకాశం వుండదు. 14 సంవత్సరాల క్రితం వెల్లడైన సత్యం కంప్యూటర్స్ దొడ్డిదారి కుంభకోణం కూడా ఇటువంటిదే. తనకు రాని ఆదాయాన్ని చూపించి, పుస్తకాల్లో అంకెలను విపరీతంగా పెంచి వేసి షేర్ విలువను అమాంతంగా ఆకాశానికి ఎక్కించి సంపదను పెంచుకొన్నానని స్వయంగా సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగ రాజు తెలియజేయడంతో ఆ కంపెనీ ఎలా మూతపడిందో ఎరుకే. అదానీ గ్రూపు కూడా వెంటనే కాకపోయినా మున్ముందు అటువంటి దుర్గతిని చవిచూసే అవకాశం లేకపోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News