మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చి త్తశుద్ధి ఉన్నా పార్లమెంట్‌లో అదానీ అంశంపై చర్చ జరపాల్సిందేనని, అప్పటి వరకు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేస్తూనే ఉంటామని బిఆర్‌ఎస్ ఎంపీలు హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, లోక్ సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, అదానీ వ్యవహారంపై చర్చ జరపడానికి కేంద్రానికి గల అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. దేశంలోని అన్ని ప్రతిపక్షాలు ఇదే అంశంపై డిమాండ్ చేస్తుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. దేశాన్ని కుదిపేస్తున్న అదానీ వ్యవహారంలో కేంద్రం అనుసరిస్తున్న మౌనం అనేక అనుమానాలకు దారితీస్తోందన్నారు.
ఇందులో ఎలాంటి మతలబు లేదని కేంద్రం భావిస్తే….ఉభయ సభల్లో చర్చించడానికి ఎందుకు జంకుతోందని వారు ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై అసలు ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటి వరకు ఎందుకు స్ప ందించడం లేదని నిలదీశారు. కేంద్రం ఇలాగే వ్యవహరిస్తుంటే బిఆర్‌ఎస్ పక్షాన తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. దీనిపై ఉభయ సభల్లో చర్చ జరిపేంత వరకు తమ ఆందోళన కొనసాగుతోందని స్పష్టం చేశారు. అవసరమైతే మరింత ఉదృతంగా ఆందోళన కొనసాగిస్తామన్నారు. కేంద్రం నుంచి కదలిక వచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ నోటీసులు ఇస్తూనే ఉంటామని వారు వెల్లడించారు. దేశ సమస్యలపై చర్చ జరగాలని అందరూ భావిస్తారని, కానీ తామే ముందుకొచ్చి చర్చ కోరినాకేంద్రం వెనక్కి పోతుందన్నారు.