Wednesday, December 25, 2024

అదానీకి ఎదురా!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: కేరళ తిరువనంతపురం చేరువలోని విఝింజమ్‌లో నిర్మాణంలోని అదానీల అంతర్జాతీయ సీపోర్టు (రేవు)కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్థానిక మత్సకారులకు అధికార సిపిఐ(ఎం), ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఏ ఒక్క పార్టీ అండగా నిలబడకపోగా, రోమన్ కేథలిక్ (ఆర్‌సిఎం) మిషన్ చర్చి మాత్రమే వారి తరపున పోరాడుతూ వుండడం గమనించవలసిన అంశం. సోమవారం నాడు వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం సంక్షోభానికి పరిష్కారం కనుగొనడంలో విఫలమైందన్న వార్త గమనించదగినది. ఒక వైపు అదానీ ప్రాజెక్టు నిర్మాణం నిరాటంకంగా కొనసాగాలని పాలక, ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అదే సమయంలో ఆందోళనకారుల ఓటు బ్యాంకును కోల్పోరాదని ఆశిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయిన రాజకీయ పార్టీలు సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నాయి.

అందరూ కలిసి చర్చిని నిందించడం విశేషం. వీరిలో స్థానిక హిందూత్వ శక్తులు కూడా వుండడం గమనార్హం. 26వ తేదీ శనివారం నాటి నిరసనలకు సంబంధించి పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆదివారం నాడు చర్చి ఆధ్వర్యంలో విఝింజమ్ పోలీసు స్టేషన్‌పై మత్సకారులు దాడి చేశారు. అందులో 40 మంది పోలీసులు, 20 మంది ఆందోళనకారులు గాయపడ్డారు. అనేక వాహనాలు తగలబడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి లెఫ్ట్ ప్రభుత్వ పోలీసులు 3000 మంది ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు. రూ. 7525 కోట్లతో ప్రభుత్వ, ప్రైవేటు ఉమ్మడి ఆధ్వర్యంలో అదానీలు ఇక్కడ భారీ రేవును నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్టుపై 2015 డిసెంబర్‌లో కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఊమెన్ చాంది ఉన్నప్పుడు ఈ ఒప్పందం కుదిరింది. ఈ రేవులో భారీ నౌకల కోసం 30 బెర్తులు వుంటాయి. ఇది అత్యాధునిక రేవు అని, దేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడంలో తోడ్పడుతుందని, అంతర్జాతీయ నౌకారవాణా మార్గాలకు చేరువలో వున్నదని చెబుతున్నారు. ఈ రేవు నిర్మాణంపై గత నాలుగు మాసాలుగా స్థానిక మత్సకారుల్లో వ్యతిరేకత పుంజుకొన్నది. దీని వల్ల కోత సంభవిస్తుందని, తమ ఉపాధి అయిన చేపల వేట దెబ్బ తింటుందని, తమ గ్రామాలు మునిగిపోతాయని మత్సకారులు వేదన చెందుతున్నారు. తమకు కలిగే నష్టాలపై సర్వే జరగాలని అంత వరకు నిర్మాణం ఆపివేయాలని వారు కోరుతున్నారు. ఆందోళన కారణంగా కొంత కాలం పాటు ఆగిపోయిన రేవు నిర్మాణం కోర్టు ఉత్తర్వులతో శనివారం నాడు తిరిగి ప్రారంభమైంది. ఆందోళన కూడా మళ్ళీ పుంజుకొని ఆదివారం నాటి హింసాత్మక ఘటనలకు దారి తీసింది.

అగ్రవర్ణాల నాయకత్వంలోని నాయర్ సర్వీస్ సొసైటీ, అలాగే శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం, వైకుంఠ స్వామి ధర్మ ప్రచారణ వంటి ఒబిసి హిందూ సంస్థలతో కూడిన స్థానిక ప్రజా కార్యాచరణ సంఘం రేవు నిర్మాణం తొందరగా జరగాలని కోరుకొంటున్నది. ఒక వైపు బిజెపి, మరో వైపు పాలక సిపిఐ (ఎం)ల మనోగతం కూడా అదే కావడం విశేషం. ఎలాగూ ప్రాజెక్టు ఒప్పందం కాంగ్రెస్ హయాంలోనే కుదిరింది కాబట్టి ఆ పార్టీ కూడా రేవు నిర్మాణాన్నే కోరుకొంటున్నది. ఎటొచ్చీ రోమన్ కేథలిక్ చర్చి మాత్రమే ఆందోళనకారుల వెంట వున్నది.

వారిని విదేశీ శక్తులని ప్రాజెక్టు అనుకూల వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ రేవు కోతకు గురి చేయదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. రేవు నిర్మాణాన్ని ఆపివేసి దాని ప్రభావంపై అధ్యయనం జరపాలన్న డిమాండ్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాన్ని బాధిత కుటుంబాలన్నింటికీ వర్తింప చేస్తూ తక్షణమే అమల్లోకి తేవాలని, కోతను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదాల్లో నష్టపోయిన మత్సకారులకు తొందరగా పరిహారం చెల్లించాలని, సబ్సిడీ మీద కిరోసిన్ సరఫరా చేయాలని, రేవు సమీపంలో జరుగుతున్న సాగర గర్భ తవ్వకం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను పట్టించుకోవాలని, వ్యతిరేక వాతావరణ పరిస్థితులలో పని మానేసిన దినాలకు కనీస వేతనాలు చెల్లించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి ఆచరణ సాధ్యం కానివి కావు. ఇందులో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవే. ఒప్పందం కుదరడానికి ముందు గాని, వామపక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత గాని ఈ డిమాండ్ల పరిష్కారానికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. అంబానీ పట్టింది బంగారంగానూ అడుగు పెట్టింది ఎదురులేనిదిగానూ వుంటున్న రోజుల్లో కేరళలో ఇటువంటి ప్రతిఘటన ఎదురు కావడం అక్కడ గల ప్రత్యేక పరిస్థితిని చాటుతున్నది. రేవులు, విమానాశ్రయాలు, థర్మల్, సౌర, పవన విద్యుత్తు కేంద్రాలు, సిమెంటు, శాక తైలాలు, వంట గ్యాస్ పంపిణీ వంటి అనేక రంగాల్లో అదానీలు గుత్తాధిపత్యం వహించడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం దారులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అతి బలవంతమైన సంస్థకు కేరళలో ఎదురైన ఈ వ్యతిరేకత వామపక్ష ప్రభుత్వం అండతో చల్లారిపోతుందనే భావించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News