Thursday, January 23, 2025

నిర్ణయాలు తీసుకోవడంలో వేగం తగ్గింది

- Advertisement -
- Advertisement -

Adar Poonawalla says Serum stopped vaccine production

నిర్ణయాలు తీసుకోవడంలో వేగం తగ్గింది
కేంద్రంపై సీరమ్ సిఇఓ పూనావాలా విమర్శలు
బూస్టర్ డోస్ కాలవ్యవధిని 6 నెలలకు తగ్గించాలి
వృథాను తగ్గించడం కోసం వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆపేశాం

ముంబయి: కొవిడ్‌ నుంచి రక్షణ కోసం బూస్టర్ డోసు తీసుకునే వ్యవధిని 9 నెలలనుంచి ఆరు నెలలకు తగ్గించడంతో పాటుగా చిన్నారులకు వ్యాక్సిన్‌ను అందించే విషయంలో ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఓ అదర్ పూనావాలా వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణానికి సంబంధించిన ఈ విషయంలో వేగంగా స్పందించాల్సిన చోట నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఈ మేరకు టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన కాంక్లేవ్‌లో పూనావాలా మాట్లాడారు. కొవిడ్ వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు ఇవ్వడానికి ప్రస్తుతం 9 నెలల వ్యవధిని అనుసరిస్తున్నారు. ఈ గడువును ఆరు నెలలకు తగ్గించాలని మొదటినుంచీ కోరుతున్న అదర్ పూనావాలా గడువును తగ్గించాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. తానేమీ డబ్బుల కోసం అలా అడగడం లేదని అన్నారు.

డబ్బుల కోసమే అయితే వ్యాక్సిన్ల వేస్టేజిని తగ్గించడానికి వాటిని ఉచితంగా పంపిణీ చేసే వాడినే కాదని వ్యాఖ్యానించారు. కీలక నిర్ణయాలు తీసుకోవలసిన వ్యక్తులు కానీ, కమిటీలు కానీ అంత అత్యవసరం కాదనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిర్ణయాలు తీసుకోవడంలో మునుపటి వేగం తగ్గిందని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ డోసు ధరను రూ. 600నుంచి రూ.225కు తగ్గించినా వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రజలు అలసత్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఈ కారణంగా వృథాను తగ్గించడం కోసం తమ కంపెనీ గత డిసెంబర్‌నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆపి వేసిందని చెప్పారు. బూస్టర్ బోసు ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పూనావాలా అన్నారు.చాలా దేశాలు తమ దేశంలోకి రాకపోకలకు బూస్టర్‌డోస్‌ను తప్పనిసరి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కాబట్టి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు బూస్టర్ డోసు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. డోసుల మధ్య వ్యవధి పెరిగే కొద్దీ యాంటీ బాడీలు తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. కాబట్టి బూస్టర్ డోసు వ్యవధిని 6 నెలలకు తగ్గించాలన్నారు. 7 11 ఏళ్ల వయసు చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు కొవోవ్యాక్స్‌కు నియంత్రణ సంస్థలనుంచి అనుమతి లభించిందని, ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామని పూనావాలా చెప్పారు. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించినప్పటికీ అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాన్ని మాత్రం మరిచిపోయిందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News