Thursday, January 23, 2025

అదరాలి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

బాలాపూర్:రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి 21 రోజులపాటు అధికారికంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను మహేశ్వరం నియోజకవర్గంలో పండుగ వాతావరణం మధ్య ఆద్యంతం ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి బిఆర్‌ఎస్‌పార్టీ శ్రేణులకు సూచించారు. మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో గల ఎస్‌వైఆర్‌గార్డెన్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో మంత్రి సబిత ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్సవాల నిర్వహణపై పార్టీశ్రేణులకు దిశా ,నిర్ధ్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వం నిర్ధేశించిన తేదీల ప్రకారం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టి, విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమనేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాలను పణంగాపెట్టి రాష్ట్రాన్ని సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం సాధించిన ప్రగతిని గడప,గడపకు వివిరిస్తూ ఘనంగా ఉత్సవాలను నిర్వహించాలని అన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలో గత 9 ఏండ్లల్లో ఉన్నో అద్బుతాలు సృష్టించి, అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెం:1గా నిలిచిందని, తెలంగాణలో హనుమంతుడి గుడిలేని ఊరు.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉండదని అన్నారు. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధితో పాటు ఒక్కో రంగంలో సాధించిన ప్రగతిని ప్రతి గ్రామంలోని ప్రజలకు తెలియజేసే విధంగా వివరించాలని అన్నారు. ఉత్సవాల్లో భాగంగా పేదలకు నివాసస్ధలాల పట్టాలు,గొర్రెలు, న్యూట్రీషన్ కిట్లు పంపిణీ, హరితహారంతో పాటు కులవృత్తులపై ఆధారపడ్డ వారికి రూ.లక్ష అందించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

2వ తేదీన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ,వారికి నివాళులు అర్పించడంతో ప్రారంభమై, 22వ తేదీన అమరవీరుల సంస్మరణసభ,స్ధూపం ఆవిష్కరణలతో ముగుస్తాయని,రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన అనంతరం జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం అందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు జరుగుతున్న కృషి,మన ఊరు.. మన బడితో పాఠశాలల్లో వచ్చిన మార్పులను నాడు.. నేడు ఫొటోల ద్వారా ప్రదర్శించాలని, నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ తదితర పాఠశాలల వివరాలను తెలియజేయాలని అన్నారు.విద్యార్ధులకు వ్యాసరచన,చిత్రలేఖనం,పాటల పోటీలను నిర్వహించి,పనులు పూర్తయ్యి సిద్ధంగా ఉన్న మన ఊరు.. మన బడి పాఠశాలలను ప్రారంభించి, 20వ తేదీన విద్యార్ధులకు పాఠ్య, నోట్ పుస్తకాలు,ఏకరూప దుస్తులను అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల గ్రంథాలయాలు,1600 డిజిటల్ క్లాస్‌రూంలను ప్రారంభించనున్నామని అన్నారు. పల్లె,పట్టణ ప్రగతితో జాతీయస్ధాయి అవార్డులు సాధించి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబుచేసి ప్రత్యేక తీర్మాణాలను చేయాలని,దేవాలయాలు,మజీదులు,చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు,ప్రార్ధనలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు .కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టును సైతం పూర్తిచేసి ఈ ప్రాంతానికి నీరు అందించేందుకు కెసిఆర్ కృషి చేస్తున్నాడని,చెరువుల దినోత్సవం రోజున నియోజకవర్గంలోని అన్ని చెరువుల వద్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అన్నారు .ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను పెద్దఎత్తున ప్రచారం చేయడంతో పాటు గ్రామాల వారీగా లబ్దిదారులకు అందుతున్న రైతు బంధు,రైతు భీమా,ఆసరా పింఛన్లు, షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ,చెరువుల్లో వదిలిన చేపపిల్లలు,గొర్రెల పంపిణీ తదితర అన్ని రకాల పథకాల సంఖ్యాపరమైన వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అన్నారు. అ దేవిధంగా పల్లె,పట్టణ ప్రగతిలో మంజూరైన పనుల వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల వివరాలు తెలిసే విధంగా ప్రచారం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జెడ్‌పి ఛైర్‌పర్సన్ తీగల అనితహరినాధ్‌రెడ్డి,రాష్ట్ర గ్రంధాలయ సంస్ధ ఛైర్మెన్ ఆయాచితం శ్రీధర్, పలువురు ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News