బిఆర్‌ఎస్ మాదిరిగా విలాసాలకు హెలికాప్టర్ వాడే
అలవాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ఎవరు?, జాతీయ అధ్యక్షుడు ఎవరో చెప్పాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కెటిఆర్‌కు దమ్ముంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పదవి తెచ్చుకోవాలని అని ఆయన సవాల్ విసిరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాదిరిగా పిసిసి అధ్యక్షుడు అయిన రెండు సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి కావాలని ఆయన కెటిఆర్‌కు సూచించారు. దమ్ముంటే బిఆర్‌ఎస్ పార్టీలో బిసిని లేదా ఎస్సీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని ఆయన సూచించారు.
బిఆర్‌ఎస్ మాదిరిగా విలాసాలకు హెలికాప్టర్ వాడే అలవాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని తమలాగా సొంత హెలికాప్టర్ కాంగ్రెస్‌కు లేదని అద్దంకి దయాకర్ అన్నారు. రెండు, మూడు కార్యక్రమాలు ఉంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా హెలికాప్టర్ వాడుతున్నారని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ అని పెడుతున్నారని అవి బిఆర్‌ఎస్ రజతోత్సవాలా? లేక టిఆర్‌ఎస్ రజతోత్సవాలా? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ పుట్టి 3ఏళ్లు, టిఆర్‌ఎస్ కనుమరుగై మూడు ఏళ్లు అయ్యిందని ఈ రజత్సోవాలు దేనికి సంబంధించినవో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బిఆర్‌ఎస్‌ను జనతా గ్యారేజీగా భావించి సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారని కెటిఆర్ అంటున్నారని, జనతా గ్యారేజీలో ఓనర్ కొడుకు విలన్ అని, మీ జనతా గ్యారేజీలో కెటిఆర్ విలనా అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ పిలుపు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కెటిఆర్, హరీష్ రావు, కవితలు ప్రజలకు కట్టుకథలు చెబుతున్నారని, మరీ కెసిఆర్ బయటకు వచ్చి పిట్ట కథలు చెబుతారా అని ఆయన ఎద్దేవా చేశారు.